బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా
  •     రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతిపై జాతీయ రహదారిపై ఆందోళన 
  •     న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో ధర్నా విరమించిన గిరిజనులు 

సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో సోమవారం ట్రాక్టర్‌‌‌‌ను ఢీకొన్న సంఘటనలో రవి, దేవిసింగ్ అనే  ఇద్దరు మృతి చెందగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని మృతుల బంధువులు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు.  గాంధారి మండలంలోని కాటేవాడి తండాకు చెందిన గిరిజనులు జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఇరు వైపుల వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు ధర్నా చేస్తున్న గిరిజనులతో మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లారీ యజమాని ఆంధ్రకు చెందిన వారని అక్కడి పోలీసులతో మాట్లాడి ఆయన్ని తీసుకొస్తామని చెప్పారు.  లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశామని పేర్కొన్నారు.  బందోబస్తులో సదాశివనగర్​, రామారెడ్డి, తాడ్వాయి ఎస్సైలు రాజు, విజయ్, పోలీస్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.