![హైనా సంచారంతో ఆందోళన](https://static.v6velugu.com/uploads/2025/02/concern-over-hyena-migration-at-hanmakonda-district_RrMBGOIEUm.jpg)
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో లేగదూడలపై దాడి
వర్దన్నపేట,(ఐనవోలు)వెలుగు: హైనాల సంచారంతో హన్మకొండ జిల్లా ఐనవోలు మండల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామ శివారులో నాలుగు రోజుల కింద అజయ్, రాజారపు పోషాలు తమవ్యవసాయ బావి వద్ద పాకలో కట్టేసిన లేగ దూడలపై హైనాలు దాడి చేసి చంపేశాయి.
అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దాడి చేసింది హైనాగా గుర్తించారు. రైతులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శుక్రవారం వేకువజామున గండు రాజు వ్యవసాయ బావి వద్ద ఉన్న పాకలో కట్టేసిన లేగ దూడ హైనా దాడిలో చనిపోయింది. నాలుగు రోజుల్లో మూడు లేగదూడలను హైనా చంపేయడంతో రైతులు భయపడుతున్నారు. రైతుల ఫిర్యాదుతో శుక్రవారం అటవీ శాఖ అధికారులు హైనాను బంధించడానికి బోను ఏర్పాటు చేశారు.