
- సహాయ చర్యలకు ఆటంకం.. స్పాట్‌కు వెళ్లలేకపోతున్న రెస్క్యూ టీమ్స్
- ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్.. కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం
- ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి
- 200 మీటర్ల పొడవునా పేరుకుపోయిన శిథిలాలు
- మరోవైపు నిరంతరాయంగా ఉబికివస్తున్న నీటి ఊట
- గంటకు దాదాపు 10 వేల లీటర్ల నీళ్లు
- 13.8 కిలోమీటర్ల వరకే వెళ్లగలిగిన రెస్క్యూ బృందాలు
- కూలిన స్లాబ్, మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు
- రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ టీమ్స్
- దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎట్లున్నరో ఏమోనని ఆందోళన నెలకొన్నది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, రాళ్లు పేరుకుపోవడంతో.. ఆచోట సొరంగం మొత్తం పూడుకుపోయింది. దీనికితోడు నిరంతరాయంగా నీటి ఊట ఉబికివస్తున్నది. టన్నెల్ ఎంట్రెన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద పైకప్పు కూలగా.. రెస్క్యూ టీమ్ 13.8 కిలోమీటర్ల దూరం వరకే వెళ్లగలుగుతున్నది.
ప్రమాదం జరిగిన చోట 200 మీటర్ల పొడవునా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు శిథిలాలు, బురద పేరుకుపోయింది. మరోవైపు టన్నెల్ లోపల ఆక్సిజన్ పైప్ కూడా పగిలిపోయింది.దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఏమోనని తీవ్ర ఆందోళన నెలకొన్నది. వాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీమ్స్‌ను రంగంలోకి దింపింది.
నాలుగు దిక్కుల నుంచి నీళ్లు..
టన్నెల్‌లో ప్రమాదం జరిగిన పాయింట్వద్ద నాలుగు దిక్కుల నుంచి నీటి ఊట ఉబికివస్తూనే ఉంది. దీంతో బురద ఎక్కువగా పేరుకుపోతున్నది. గంటకు దాదాపు 10 వేల లీటర్ల వరకు నీళ్లు వస్తుండడం రెస్క్యూ పనులకు అడ్డంకిగా మారింది. దీంతో ఆఫీసర్లు డీవాటరింగ్పనులు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన స్పాట్వద్ద కటిక చీకటి నెలకొన్నది.
టన్నెల్మూసుకుపోవడంతో వెంటిలేషన్కూడా లేదు. దీంతో గల్లంతైన వారికి ఆక్సిజన్ అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలోపల పనిచేసేటోళ్లకు ఆక్సిజన్ అందించేందుకు గాను టన్నెల్ పనులు ప్రారంభించిన సమయంలోనే పైపులైన్ఏర్పాటు చేశారు. అయితే శనివారం జరిగిన ప్రమాద ధాటికి ఆ పైపులైన్పగిలిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందడం లేదనేది స్పష్టమవుతున్నది.
లోపలికి వెళ్లిన మంత్రి జూపల్లి..
సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన ఇంజనీర్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆదివారం మధ్యాహ్నం రెండు హెలికాప్టర్లలోఎక్విప్మెంట్తో నాగర్‌కర్నూల్‌జిల్లా దోమలపెంటలోని ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం 300 మంది పాలుపంచుకుంటున్నారు.
వీరిలో ఆర్మీ నుంచి 35 మంది, ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి 120 మంది, ఎస్డీఆర్‌ఎఫ్ నుంచి 45 మంది, హైడ్రా నుంచి 24 మంది, సింగరేణి నుంచి 24 మంది, ఫైర్ డిజాస్టర్ టీమ్ నుంచి మరికొంత మంది ఉన్నారు. ఇందులో ఫైర్ డిజాస్టర్టీమ్శనివారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో లోకోలో టన్నెల్‌లోపలికి వెళ్లింది. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. ఈ టీమ్ లోపల పరిస్థితిని వీడియోలు తీసింది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్టీమ్స్ లోకోలో టన్నెల్‌లోపలికి వెళ్లాయి.
ఈ టీమ్స్‌తో కలిసి ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్లారు. లోపల కరెంట్ లేకపోవడంతో వెంట టార్చ్ లైట్లు, నీరు వస్తే బయటకు రావడానికి టైర్ ట్యూబ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, హెల్మెట్లు, తాళ్లు, నిచ్చెనలు, పారలు, వెదురు బొంగులు, తెప్పలు వెంట తీసుకెళ్లారు. అయితే దాదాపు 12 కిలోమీటర్ల దూరం వెళ్లగా.. అక్కడంతా బురద, మట్టి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు.
కన్వేయర్ బెల్ట్‌పైనా డెబ్రిస్..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 200 మీటర్ల పొడవునా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు డెబ్రిస్, బురద పేరుకుపోయింది. మరోవైపు నీట ఊట ఉబికివస్తూనే ఉన్నది. దీంతో లోకోలో 12 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్న రెస్క్యూ టీమ్స్.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉండటంతో, దాని సాయంతో మరో 1.8 కిలోమీటర్లవరకు నడుచుకుంటూ వెళ్లగలిగారు. అంటే మొత్తంగా 13.8 కిలోమీటర్ల వరకు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
కన్వేయర్ బెల్ట్‌పైనా డెబ్రిస్పేరుకుపోయాయి. దీంతో ముందుగా కన్వేయర్బెల్ట్పై ఉన్న డెబ్రిస్‌ను క్లియర్చేసేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని క్లియర్‌చేసి, స్పాట్వద్ద పేరుకున్న డెబ్రిస్‌ను బయటకు తరలించాలని ప్లాన్చేస్తున్నాయి. అట్లయితే ముందుకు వెళ్లడానికి, సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి.
ఆ తర్వాత వెల్డింగులు, ఇతర రిపేర్లు చేసి సీపేజ్‌ను అరికట్టే ప్రయత్నం చేయొచ్చనే ఆలోచన చేస్తున్నాయి. అయితే ఈ పని చేసేందుకు దాదాపు 4 నుంచి 5 రోజుల టైమ్ పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో మట్టిపెల్లలు పడుతూనే ఉన్నాయి. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎంత లోతు వరకు బురద ఉందనేది వాటర్ స్కానర్ఎక్విప్మెంట్ద్వారా ఆర్మీ బృందం పరిశీలిస్తున్నది.
టన్నెల్ దగ్గరే ఉత్తమ్, జూపల్లి..
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం హెలికాప్టర్‌లో మంత్రులు ఇద్దరూ స్పాట్‌కు చేరుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మంత్రి జూపల్లి రెస్క్యూ టీమ్స్‌తో కలిసి టన్నెల్ లోపలికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 6:40 గంటల టైమ్‌లో ఆయన బయటకొచ్చారు. రెస్క్యూ సిబ్బంది అక్కడే ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్నరా..?
ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషిన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడి, నీళ్లు లోపలికి వస్తుండడంతో వాళ్లంతా టీబీఎం మిషిన్‌లో తలదాచుకొని ఉండొచ్చని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి చూడగా, ఆ మిషిన్ మొత్తం శిథిలమైపోయింది. ప్రమాద ధాటికి దాదాపు 90 మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికితోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు.
శనివారం అర్ధరాత్రి 2 గంటలకు టన్నెల్‌లోకి వెళ్లిన ఫైర్ డిజాస్టర్ టీమ్.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికులను పేర్లు పెట్టి గట్టిగా పిలిచింది. ‘మనోజ్ త్రివేది.. శ్రీనివాస్.. హమారా వాయిస్ ఆప్ సున్ రహే క్యా’ అంటూ అరిచింది. కానీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతున్నది.