జగిత్యాలలో అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆందోళన

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించారని.. గ్రామస్తులు రోడ్డు పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డు పై బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తాడని ఆశగా ఎదురుచూశామని కాని.. కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళిపోయారని వారు ఆరోపించారు. తమకు నిరాశే మిగిలిందని అసహనం వ్యక్తం చేస్తూ.. రోడ్డు పైనే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. 

మండలంగా ప్రకటించేందుకు అల్లిపూర్‭కు అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు రహదారిపై నిరసనకు దిగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అల్లిపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.