మరికల్, వెలుగు : మక్తల్‌లో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ మరికల్‌లోని సరస్వతి డిగ్రీ కాలేజీ ముందు బుధవారం డిగ్రీ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల నుంచి రావడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టైం అవుతుందనే భయంతో ఉరుకులు, పరుగుల మీద వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోయారు.
మూడేండ్ల నుంచి మక్తల్‌లో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదున్నారు. ఎగ్జామ్ ప్రారంభమైనా విద్యార్థులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు. చివరకు మక్తల్ నుంచి అయ్యప్ప కాలేజీ నిర్వాహకులు వచ్చి పరీక్ష రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాలమూరు యూనివర్సిటీ ఏఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు రాజ్‌కుమార్, కుమారస్వామి పరీక్ష కేంద్రానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలాఉంటే మరికల్‌లోని సరస్వతి డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తూ డీబారైన మాగనూర్ మండలం అచ్చంపేటకు చెందిన ఆంజనేయులు సూసైడ్ చేసుకున్నాడు. స్టూడెంట్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు యూనివర్సిటీ అధికారులను కోరారు.