మంత్రి వీడియో కాన్ఫరెన్స్​లో రైతులు అంతంతే..

మంత్రి వీడియో కాన్ఫరెన్స్​లో రైతులు అంతంతే..
  • సమీకరించడంలో విఫలమైన వ్యవసాయ అధికారులు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా ఎలా ఉండాలన్న అంశంపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు రైతులను సమీకరించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరగాల్సి ఉంది. 

కానీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగింది. దీనికి జిల్లాలో రైతుల నుంచి స్పందన కరువైంది. చెన్నూర్ మండలం కిష్టంపేట రైతు వేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో రైతులు పెద్దగా కనిపించలేదు. వచ్చినవారు కూడా సంతకాలు చేసి వెళ్లిపోయారు. కొంతమంది ఏఈవోలు సైతం ఈ ప్రోగ్రాంకు డుమ్మా కొట్టారు. లక్సెట్టిపేటలో 20 మంది రైతులు మాత్రమే హాజరుకాగా, కన్నెపల్లి, బెల్లంపల్లిలో 50 మందిలోపే వచ్చారు.

పదెకరాలు సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలి: రైతు పులిశెట్టి సత్తయ్య  

పదెకరాల భూమి సాగు చేసే రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామానికి చెందిన పులిశెట్టి సత్తయ్య కోరారు. కన్నాల రైతు వేదికలో నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. రైతులకు మంత్రితో మాట్లాడే చాన్స్ రాకపోగా చివరగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ తాండూర్ మండలం ద్వారకాపూర్​కు చెందిన సత్తయ్యకు మాట్లాడే అవకాశం కల్పించారు. పాడుబడ్డ, సాగు యోగ్యం కాని, సాగు చేయని భూములకు రైతుబంధు ఇవ్వకూడదని ఆయన కోరారు. స్పందించిన డైరెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.