గన్నేరువరం, వెలుగు: లంచం ఇవ్వలేదని జాబ్ నుంచి తీసివేశారని మహిళా అటెండర్ పురుగుమందు డబ్బాతో ఎంపీడీవో ఆఫీస్ ఎదుట నిరసనకు దిగిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. గన్నేరువరం ఎంపీడీవో ఆఫీస్‌లో అటెండర్‌గా ఎడ్ల లక్ష్మి కొన్నేండ్లుగా అవుట్ సోర్సింగ్‌పై పని చేస్తోంది. జాబ్ ఉండాలంటే రూ.40వేలు ఇవ్వాలని ఎంపీడీవో శంకర్, ఏపీవో స్వాతి వేధిస్తూ నెల కింద తనను తీసివేసినట్టు బాధితురాలు ఆరోపించింది.
నిరుపేదనని అంత ఇవ్వలేనని వేడుకున్నా కనికరించలేదని, విధులకు రావొద్దని వేధించారని ఆమె ఆవేదనతో చెప్పింది. ఉన్నతాధికారులు స్పందించి తన జాబ్ ఇప్పించాలని కోరింది. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి ఆమె వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కొని.. నచ్చచెప్పి బాధితురాలిని పంపించారు. ఎంపీవో స్వాతిని వివరణ కోరగా విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అధికారుల పట్ల ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే ఆమెను తొలగించినట్లు చెప్పారు.