కామారెడ్డి, వెలుగు: మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్‌తో జిల్లా వ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించిన దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట పీఎస్‌కు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచి తర్వాత వదిలేశారు. ఈయనను స్టేషన్‌లో జిల్లా ప్రెసిడెంట్ అరుణతార పరామర్శించారు. మరో యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
రైతుల పోరాటానికి అండగా ఉంటాం
ఆర్మూర్, వెలుగు: కామారెడ్డి రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, అవసరమైతే ఐక్య ఉద్యమానికి కామారెడ్డి వెళ్తామని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్, నాయకులు బి.దేవరాం చెప్పారు. శుక్రవారం ఆర్మూర్‌లో వారు మీడియాతో మాట్లాడారు. రైతుల డిమాండ్ మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, పారిశ్రామిక జోన్ ప్రకటనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీవైఎల్ జిల్లా ప్రెసిడెంట్ బట్టు కిషన్, నాయకులు శేఖర్, రాజన్న, ఎం.నరేంద్ర, ఎల్.అనిల్‌కుమార్, టాగూర్, నజీర్, పద్మ పాల్గొన్నారు.
రైతులంటే వెటకారమా!
అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు రాములు ఆత్మహత్య చేసుకుంటే ‘కామారెడ్డి జిల్లాలో ఏవరో రైతు ఆత్మహత్య చేసుకున్నారట’ అని మంత్రి కేటీఆర్ వెటకారంగా మాట్లాడంపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఉండదన్నారు. ఇక కేసీఆర్‌కు శంకరగిరి మాణ్యాలే దిక్కన్నారు. రైతుల ఆందోళన న్యాయపరమైనదని అందుకే కామారెడ్డిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారన్నారు. మాస్టర్ ప్లాన్ కోసం రైతు ఆత్మహత్య చేసుకొలేదని వ్యక్తి గత కారణాలంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెప్పటం సిగ్గు చేటన్నారు.