- పంటల సాగుపై స్పష్టత లేక ఆందోళనలో పాలమూరు రైతులు
నాగర్‌కర్నూల్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన రైతాంగానికి యాసంగి సాగుకు నీళ్ళిస్తారా? లేదా? అనే విషయంపై ఆందోళన మొదలైంది. గత ఏడాది మాదిరిగానే ఈ యాసంగిలో నీరు వదలకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టుల వారీగా సాగునీటి సలహా సంఘం(ఐఏబీ)సమావేశాలు నిర్వహించి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆ ఊసెత్తడం లేదు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఇరిగేషన్ సర్కిల్స్ ఉన్నాయి.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న జలాశయాల్లో నీటి నిల్వ వివరాలు, కృష్ణా నదిలో నీటి లభ్యత, విద్యుత్, సాగు, తాగునీటి అవసరాలపై ఈ పాటికే ఒక అంచనాకు రావాల్సిన ఇరిగేషన్ అధికారులు ఎటు తేల్చడం లేదు. యాసంగిలో నాలుగు ప్రాజెక్టుల కింద దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వరి వేసుకోవాలా? లేదంటే ఆరు తడి పంటలు సాగు చేయాలా? అనే విషయంపై స్పష్టత లేకుండా పోయిందని వాపోతున్నారు.
రెండేండ్లుగా మీటింగ్ నిర్వహించలే..
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ, ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం, యాసంగిలో ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టకు నీటి లభ్యత తదితర కీలక అంశాలపై ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించాల్సిన సాగు నీటి సలహా సంఘం సమావేశం రెండేండ్లుగా వాయిదా వేస్తున్నారు. జూరాల, నెట్టెంపాడు, కేఎల్ఐ, ఆర్డీఎస్ కింద ఈ యాసంగి సాగుకు సాగునీటి అవసరాలను అంచనా వేయాల్సిన అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు.
వ్యవసాయ, జెన్కో, మిషన్ భగీరథ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో సాగునీటి సలహా సంఘం సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. చివరిగా 2022 జూన్‌లో సమావేశం నిర్వహించారు. ఆ తరువాత ఈ విషయాన్ని మరిచిపోవడంతో రిజర్వాయర్ల వారీగా నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలపై అయోమయం నెలకొంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించి యాసంగి సాగుపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
సమస్యలపై దృష్టి పెట్టాలి..
నెట్టెంపాడు లిఫ్ట్‌లోని ప్రధానమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు బుంగపడి నాలుగేండ్లు దాటినా గత ప్రభుత్వం దాన్ని పూడ్చే ప్రయత్నం చేయలేదు. బుంగను పక్కకు పెట్టి, గట్టు లిప్ట్ను తెరపైకి తెచ్చారు.ఆర్డీఎస్ కింద రెండు సీజన్లలో ఎన్ని ఎకరాలకు సాగు నీరిస్తారనే దానిపై ఇప్పటికి లెక్కలు లేవు. జూరాల కింద ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు.
గడిచిన పదేండ్లలో పాలమూరు పచ్చబడిందని చెప్పుకుంటూ ఉన్న నీటిని వాడుకోలేని దుస్థితికి తెచ్చారని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకుని ప్రాజెక్టుల వారీగా సమావేశాలు నిర్వహించి ఉన్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై చర్చిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
118 టీఎంసీలకు తగ్గిన శ్రీశైలం
ఈసీజన్లో కృష్ణా నదికి ఊహించని విధంగా పలుమార్లు వరద వచ్చింది. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదలాల్సి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పూర్తి స్థాయిలో 215 టీఎంసీలు నీటి నిల్వ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో, డిసెంబర్ మొదటి వారానికి 118 టీఎంసీలకు పడిపోయింది. ఈ నీటితోనే మిసన్ భగీరథ తాగునీటి అవసరాలు, కేఎల్ఐ కింద 2.50 లక్షల ఎకరాల యాసంగిసాగుకు నీరివ్వాల్సి ఉంది. నెట్టెంపాడు కింద 2లక్షల ఎకరాలు, జూరాల కింద 1.10 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది.
శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వలతో పాటు జూరాల నిల్వలు, నెట్టెంపాడు రిజర్వాయర్లలో నింపిన నీటితో యాసంగికి సాగునీటిని అందించాల్సి ఉంది. 18 నియోజకవర్గాల పరిధిలోని 3,500 ఆవాసాలకు తాగునీటిని సప్లై చేయాలి. కేఎల్ఐ కింద కేటాయించిన 40 టీఎంసీల్లో ఇప్పటి వరకు 11 టీఎంసీలు మాత్రమే వినియోగించారు. తాగునీటి అవసరాలకు మరో 6 టీఎంసీలు వాడుకున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతుండడంతో ఆందోళన నెలకొంది.