ఎండకాలం రాకముందే ..పడిపోతున్న నీటి మట్టం

ఎండకాలం రాకముందే ..పడిపోతున్న నీటి మట్టం
  •     నెల రోజుల్లో జిల్లా సగటు 1.17 మీటర్ల తగ్గుదల
  •     అంబారీపేటలో నెల రోజుల్లోనే 9.67 మీటర్లు లోపలకు 

కామారెడ్డి​​, వెలుగు : ఎండకాలం రాకముందే కామారెడ్డి జిల్లాలో నీటి మట్టాలు కిందకు పడిపోతున్నాయి. నెల రోజుల్లోనే   జిల్లా సగటు నీటి మట్టం 1.17 మీటర్లు తగ్గింది. పలు ఏరియాల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోయాయి. దోమకొండ మండలం అంబారీపేటలో నెల రోజుల్లోనే 9.67 మీటర్ల లోపలకు వెళ్లాయి.  ఇప్పుడే పరిస్థితి ఇట్లాఉంటే రానున్న ఎండకాలంలో  ఎక్కువగా జలాలు అడుగంటే ప్రమాదం ఉంది.  వ్యవసాయక జిల్లా కావటం,  భూ గర్భ జలాల ఆధారంగా ఎక్కువ  విస్తీర్ణంలో పంటలు సాగు కావటం వల్ల ఈ పరిస్థితులు ఆందోళనపెడుతున్నాయి. 

గ్రౌండ్​ వాటరే ఆధారం..

జిల్లాలో 5 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. సాగు నీటి ప్రాజెక్టులు లేని ఈ జిల్లాలో బోర్ల ఆధారంగా పంటలు పండుతున్నాయి. జిల్లాలో 1,09,436 అగ్రికల్చర్ కరెంట్​ ​ కనెక్షన్లు అధికారికంగా ఉండగా మరో 5వేల కనెక్షన్లు ఆనాధికారికంగా ఉంటాయి.  యాసంగిలో 2 లక్షల ఎకరాలు కంప్లీట్​గా బోర్ల కిందనే ఉంటాయి. నవంబర్​, డిసెంబర్ వచ్చే సరికి నీటి మట్టాలు జిల్లా వ్యాప్తంగా పడిపోయాయి.

నవంబర్​లో సగటు నీటి మట్టం 8.13 మీటర్లు ఉండగా, డిసెంబర్ వచ్చే సరికి 9.31 మీటర్లకు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా సగటు నీటి మట్టం 1.17 మీటర్లు పడిపోయింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ ఏరియాల్లో నీటి మట్టాలు ఎక్కువగా పడిపోతున్నాయి. నిజాంసాగర్​ ప్రాజేక్టు కు సమీపంలో ఉన్న అచ్చంపేట, మహ్మద్​నగర్​లో కూడా 3 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోయాయి. 

అంబారీపేటలో అత్యధిక లోతుల్లో

 దోమకొండ మండలం అంబారిపేటలో నెల రోజుల్లో 9.67 మీటర్ల మేర లోతుల్లోకి చేరాయి. పిట్లం మండలం కుర్తిలో 8.49 మీటర్ల మేర తగ్గింది. గాంధారిలో ప్రస్తుతం 15.79 మీటర్ల అడుగులోకి పోగా అంతకు ముందు నేలలో 8.89 మీటర్లలో నీళ్లు ఉండేవి. అలాగే రాజంపేట మండలం సిద్దాపూర్​లో 4.83 మీటర్లు, అచ్చంపేటలో 4.64 మీటర్లు, లింగంపేట మండలం కన్నాపూర్​లో 3.86 మీటర్లు తగ్గాయి. భవానిపేట, మోతే, మహ్మద్​నగర్ లో దాదాపు 3 మీటర్ల మేర నీళ్లు అడుగంటాయి. 

నీటిని పొదుపుగా వాడుకోవాలి

రానున్నది ఎండకాలం. దీన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలి. పలు ఏరియాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ప్రస్తుతం బోర్ల కింద పంటలు సాగులో ఉన్నందున నీటి వాడకం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో నీరు లోపలికి వెళ్తుంది.  వానకాలంలో ఎక్కడికక్కడే భూమి లోకి నీళ్లు ఇంకిస్తే కొంత పైకి వచ్చే విలుంది

– సతీశ్​​ యాదవ్, జిల్లా భూగర్భజల అధికారి