వడ్లు కొనేటోళ్లు లేక రోడ్లపైనే అన్నదాతలు

  • ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతుల ఆందోళనలు
  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ నిలదీత
  • టోకెన్ల కోసం పాలకవీడు అగ్రికల్చర్ ఆఫీసుకు తాళం వేసి నిరసన

నెట్​వర్క్, వెలుగు: ఆరుగాలం పండించిన వడ్లను అమ్ముకునేందుకు రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సోమవారం కొన్నిచోట్ల రైతులు రోడ్డెక్కగా, ప్రారంభించిన కేంద్రాల్లో తరుగు పేరుతో దగా చేస్తున్నారంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలకు దిగారు. బారదాను ఇవ్వకుండా పంటను ఎట్ల తీసుకురావాలె అని ఆఫీసర్లను నిలదీశారు. ముమ్మరంగా కోతలు సాగుతున్న టైంలో టోకెన్​సిస్టమ్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
20 వేల క్వింటాళ్ల కుప్పలు
వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్​చేస్తూ శివసేన పార్టీ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని వ్యవసాయ మార్కెట్ ఆఫీస్​వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. పంట చేతికొచ్చి 20 రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. వడ్ల కుప్పల వద్ద చలికి వణుకుతూ రైతులు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలతో కొనుగోళ్లు నిలిపివేయడం కరెక్ట్​కాదన్నారు. డైలీ వెయ్యి క్వింటాళ్లు మాత్రమే కొంటే మార్కెట్​కు తెచ్చే పంటను అమ్ముకునేందుకు రైతుకు ఎంత కాలం పడుతుందని ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ ​చేశారు. ఆయనతో రైతులు రవీందర్ గౌడ్, రాజయ్య, వెంకటయ్య, కొమురయ్య, మహిళా రైతులు ఉన్నారు. 
మిల్లర్లతో కుమ్మక్కైన్రు
రెండు, మూడు సార్లు తరుగు తీస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ సొసైటీలోని కొనుగోలు కేంద్రంలో బీర్కూర్, చించెపల్లి గ్రామాల రైతులు సోమవారం ఆందోళన చేశారు. సెంటర్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు, చైర్మన్ గాంధీతో గొడవకు దిగారు. రైస్ మిల్లర్లు, సొసైటీ నిర్వాహకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్‌‌‌‌ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. తరుగు పేరుతో మోసం చేస్తే సహించేది లేదని, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.  
మండలానికి 30, 40 అంటే ఎట్లా?
వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న టైంలో ప్రతిరోజు మండలానికి 30 లేదా 40 టోకెన్లు ఇస్తే చేతికొచ్చిన పంటను అమ్ముకునేది ఎట్లా అని సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు, నేరుడుచర్ల మండలాల రైతులు రోడ్డెక్కారు. సోమవారం మిర్యాలగూడ – కోదాడ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. టోకెన్లు లేకుండా పోతే మిర్యాలగూడ పోలీసులు వడ్ల ట్రాక్టర్లను రానియ్యట్లేదని, చిల్లేపల్లి టోల్​గేట్ వద్దనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్​గేట్​వద్దనే ఆఫీసర్లు టోకెన్లు ఇచ్చి పంపాలని డిమాండ్​చేశారు. ఆందోళనతో భారీగా ట్రాఫిక్​నిలిచింది. అలాగే పాలకవీడులోని అగ్రికల్చర్ ఆఫీసుకి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. నేరేడుచర్లలో హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి, తహసీల్దార్ సరిత, పాలకవీడులో ట్రైనీ ఎస్సై స్వాతి, అగ్రికల్చర్ ఆఫీసర్ దీపిక రైతులకు సర్ది చెప్పారు. ఆర్డీఓ వెంకారెడ్డితో మాట్లాడి టోకెన్ల సంఖ్య పెంచుతామని, టోల్​గేట్​వద్దే ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
సంచులు ఇయ్యకుండా కొనుగోళ్లా?
బారదాను(గోనె సంచులు) ఇవ్వకుండానే కొనుగోళ్లు ప్రారంభించడంతో సంగారెడ్డి జిల్లా కొండాపూర్​మండలంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్కాపూర్, గొల్లపల్లి పీఏసీఎస్ సెంటర్లలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీపీ మనోజ్​రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆఫీసర్లు, లీడర్లను బారదాను కోసం నిలదీశారు. సంచులు ఇయ్యకుండా ధాన్యం ఎట్లా కొంటారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్​మండలం అధ్యక్షుడు విఠల్, పాండురంగం, మల్లేశం, గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వడ్లు ఎట్లా తేవాలి?
బారదాను లేకుండా వడ్లను కొనుగోలు కేంద్రానికి ఎలా తీసుకురావాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​బాబును ఎల్కతుర్తి మండలానికి చెందిన రైతులు నిలదీశారు. సోమవారం దామెర, ఎల్కతుర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిపడా బారదాను ఇవ్వకపోవడంతో వడ్లన్నీ కల్లాల్లోనే ఉండిపోయాయని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడి తక్షణమే సంచుల సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​డా.సుధీర్​కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, ఆఫీసర్లు పాల్గొన్నారు.
వరి తప్ప వేరేది పండదు
యాసంగిలో వరి వేయొద్దని సీఎం కేసీఆర్​చెప్పడంతో సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల రైతులు నిరసనకు దిగారు. స్థానిక పీఏసీఎస్​కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేశారు. వరి వేయొద్దన్నప్పుడు లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టడం దేనికని ప్రశ్నించారు. తమ పొలాల్లో వరి తప్ప ఇతర పంటలు పండడం కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కండిషన్స్​లేకుండా రైతులను ప్రోత్సహించాలని కోరారు. కౌలుదారు పేర్ల మీద కూడా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. 
వీణవంకలో బీజేపీ వడ్లంటూ కొనలే
బీజేపీ మద్దతుదారుల వడ్లు కొనమని చెప్పడంతో కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముకుల్ల, రెడ్డిపల్లి గ్రామాల రైతులు సోమవారం రోడ్డెక్కారు. కరీంనగర్– జమ్మికుంట హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో బీజేపీ మద్దతుదారుల క్వింటా వడ్లకు 8 కిలోల తరుగు తీస్తున్నారని వాపోయారు. టీఆర్ఎస్​మద్దతుదారులకు మాత్రం 40కిలోల బస్తాకు కిలో తరుగు తీస్తున్నారని చెప్పారు. సహకార సంఘాల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరు టీఆర్ఎస్ లీడర్లు హుజూరాబాద్​ఎలక్షన్​అయిపోయాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మద్దతుదారులకు అనేక కొర్రీలు పెడుతూ కొనేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం అన్ని వర్గాల వడ్లకు మద్దతు ధర కల్పించాలని నినాదాలు చేశారు.