- డబ్బులు పంచుతున్నారని..దొంగ ఓట్లు వేస్తున్నారని గొడవలు
- నాన్ లోకల్ లీడర్లు తిరుగుతున్నారని ఘర్షణలు
- పోలీసుల లాఠీఛార్జ్, సుమోటో కేసుల నమోదు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ సాగాయి. 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌పై ఒక పార్టీ గుర్తు తప్పుగా ముద్రించడంతో అక్కడ పోలింగ్ రద్దు అయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో ఉద్రికత్తలు తలెత్తాయి. సిటీలో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. డబ్బుల పంపిణీ జరుగుతుందంటూ ఎక్కువ ప్రాంతాల్లో టెన్షన్లు చోటుచేసుకున్నాయి. నాన్ లోకల్ లీడర్లు వచ్చి డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గొడవ పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారాలు చేస్తున్నారని ఇంకొన్ని చోట్ల గొడవలు పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని కొట్లాటకు దిగారు. పలు చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గొడవలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు
టెన్షన్లు.. ఆందోళనలు.. లొల్లులు
- కూకట్‌పల్లిలో డబ్బులు పంచుతున్నారని నాన్‌లోకల్ లీడర్లను బీజేపీ లీడర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌ని ఆపి డబ్బులు పంచుతున్నవారిని పట్టించే ప్రయత్నం చేశారు. అప్పుడు కాన్వాయ్‌లో మంత్రి లేరు. వేరే వ్యక్తులు ఆ బండ్లలో తప్పించుకున్నారు.
- జంగమెట్ డివిజన్ 27,32 పోలింగ్‌స్టేషన్స్ వద్ద ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎంఐఎం రిగ్గింగ్ చేస్తోందని బీజేపీ ఆందోళనకు దిగింది. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
- చాదర్‌ఘట్‌లో ఎంబీటీ ఆందోళనకు దిగింది. ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారని ఆరోపించింది. టెన్షన్ నెలకొనడంతో పోలీసులు ఇద్దరు ఎంబీటీ నేతలను అరెస్ట్ చేశారు.
- జాంబాగ్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడికి యత్నించారు.జూబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన దిగాడు.
- నాంపల్లి బజార్ ఘాట్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు దాడులకు దిగారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ డ్రైవర్ బబ్లూపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో బబ్లూ తీవ్రంగా గాయపడ్డాడు.
- బంజారాహిల్స్‌రోడ్‌నంబర్12లో మౌత్ మాస్కులు,చేతి కంకణాలు గొడవకు దారి తీశాయి. బీజేపీ కార్యకర్తలు కాషాయం రంగు మాస్కులతో పోలింగ్ బూత్‌కి వచ్చారని, టీఆర్ఎస్ కార్యకర్తలు చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారు. దీంతో కార్యకర్తల వాగ్వాదం జరిగింది.
- షేక్ పేట్‌లో ఎంఐఎం,బీజేపీ కార్యకర్తల మధ్య మధ్య ఘర్షణ జరిగింది. బుర్కాలు ధరించి రిగ్గింగ్ చేశారని బీజేపీ ఆరోపించింది. ఎంఐఎం దాడిలో బీజేపీ కార్యకర్త ప్రవీణ్‌కు గాయాలయ్యాయి.
- కార్వాన్ డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితి. మజ్లిస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ
- హఫీజ్ పేట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఆందోళనకు దారితీశాయి. బీజేపీ అభ్యంతరం చెప్పడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
- తార్నాక డివిజన్ లాలాపేట 143 డివిజన్‌లో ఓటర్ స్లిప్పులతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కరపత్రాలు పంచారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
- భారతీనగర్ డివిజన్‌లోని ఎల్ఐజీ బూత్ నంబర్ 15, 16, 17 వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్లు పోలీసులకు అప్పగించారు.
- గచ్చిబౌలిలోని గోపన్‌పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దాడులకు దిగిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
- మాదాపూర్‌లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ క్యాండిడేట్ రాధాకృష్ణ యాదవ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
- గోషామహల్ డివిజన్‌లో ఓటర్ల లిస్టులో తమ ఓట్లు లేవంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు.
- వనస్థలిపురం హస్తినాపురం డివిజన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లకు టీఆర్ఎస్ వారు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో 2 పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
- వనస్థలిపురం డివిజన్ పరిధి44వ పోలింగ్ కేంద్రంలో ఓటర్ స్లిప్‌లతో టీఆర్‌ఎస్‌ప్రచారం చేసింది. బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. పోలింగ్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు.
- జీడిమెట్ల డివిజన్ లో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ స్టేషన్‌వద్ద ఓటర్ స్లిప్స్ టేబుల్ ఏర్పాటు చేసుకునే విషయంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు.
- ఎమ్మెల్యే వివేక్ సోదరుడు విశాల్ తనపై దాడి చేశాడని జయశంకర్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
- ఉప్పల్‌లోని 10వ డివిజన్ 20-28 పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 25వ బూత్‌లో ఇద్దరిని పట్టుకొని పోలీసులకు
అప్పగించారు. - బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ బూత్ నెంబర్ 60,61లో పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీజేపీ కార్యకర్తల ఆందోళన దిగారు. అధికారులు టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.
- మియాపూర్ నడిగడ్డ తండాలో ఫ్లెక్సీ పెట్టి డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు చెదరగొట్టారు.
- డిప్యూటీ స్పీకర్ పద్మరావు కుమారుడు కిరణ్ గౌడ్ వ్యవహారం వివాదాస్పదమైంది. బౌద్ధనగర్ డివిజన్‌లో డబ్బులు పంచుతున్నాడని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించింది.
- లాలాపేటలో ఓటర్ స్లిప్పుల మధ్య టీఆర్ఎస్ కరపత్రాలు పెట్టి ఓటేయాలని కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
ఒక్కొక్కరు నాలుగైదు ఓట్లు
ఓల్డ్ సిటీలోని పలు పోలింగ్ బూత్ లలో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. సాయంత్రం 5 తర్వాత కొందరు యువకు లు స్లిప్పులు తీసుకొని బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లడం కనిపించిం ది. ఒక బూత్ లో ఓటేసి.. సిరా చుక్కను తుడిచేసి మరో పోలింగ్ కేంద్రంలో ఓటే శారు. ఘన్సిబజార్ డివిజన్ కు సంబంధించి సెట్విన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌లో ఈ దృశ్యం కనిపించింది. పోలింగ్ బూత్ కు సమీపంలోనే గుంపుగా చేరి బాటిల్లో ఉన్న కెమికల్‌తో వేలికి ఉన్న సిరా చుక్క గుర్తు తుడిచేయడం.. తలా ఒక స్లిప్పు పట్టుకుని వెళ్లడం ‘వీ6 వెలుగు’ కెమెరాకు చిక్కింది. ఇలా వెళ్లినవారిలో ఒక వ్యక్తిని ఫాలో అయి అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కు సమాచారమివ్వగా ఆమె నిలదీయడంతో సదరు యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ టైమ్‌లో బూత్ లో ఎంఐఎం ఏజెంట్లు, ఇద్దరు ఇండిపెండెంట్ల తరఫు ఏజెంట్లు మాత్రమే ఉండడం గమనార్హం.