సిటిజన్‌షిప్ యాక్ట్ చదవకుండానే ఆందోళనలు

సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్‌ను ప్రతిపక్షాలు రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుంటు న్నాయి. చట్టంలో వాస్తవాలను బయటపెట్టడం లేదు. వాటిని దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. సిటిజన్ షిప్ యాక్ట్‌తో మనదేశంలోని ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి నష్టం జరగదు. వాస్తవాలు ఇలా ఉంటే వీటిని గుర్తించకుండా ఆందోళనల పేరుతో దేశంలో అశాంతి నెలకొనేలా చేస్తున్నారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ నుంచి మనదేశంలోకి వచ్చిన శరణార్థులకు సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ రక్షణ కల్పిస్తోంది. మతపరంగా ఈ మూడు దేశాల్లోని మైనారిటీల కోసమే చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అక్కడి మైనారిటీలపై ఎన్నో దారుణాలు జరిగాయి. దీంతో దాదాపు 40 ఏళ్ల కిందటే ఎంతో మంది మైనారిటీలు ఈ మూడు దేశాల నుంచి మనదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఇలా వచ్చిన వాళ్లు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇక్కడ శరణార్థులకు, అక్రమ చొరబాటుదారులకు మధ్య ఉన్న తేడా తెలుసుకోవడం ముఖ్యం. ఇంటి తలుపు కొట్టి సాయం కోరేవారు శరణార్థులవుతారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించేవారు చొరబాటుదారులవుతారు. ఈ నేపథ్యంలో దేశవ్యా ప్తంగా శరణార్థులు, అక్రమ చొరబాటుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం అన్ని పోలీస్ స్టేషన్లలో ఉంది.

వాళ్లెప్పుడైనా అప్లయ్ చేసుకోవచ్చు
బలూచ్ లు, అహ్మదీయ, రోహింగ్యా….ఈ ముస్లిం జాతులన్నీ మనదేశ పౌరసత్వం కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు అధికారులు ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. శ్రీలంక, ఉగాండ దేశం నుంచి వచ్చిన వారికి కూడా మన దేశ పౌరసత్వం ఇచ్చాం .1964, 1974 లో జరిగిన ప్రధాని స్థాయి ఒప్పందాలతో భారత సంతతికి చెందిన 4 లక్షల 61 వేల మంది తమిళులకు మన దేశ పౌరసత్వం ఇచ్చాం. ఇంకా 95 వేల మంది శ్రీలంక తమిళులు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ రాయితీలతో తమిళనాడులో నివసిస్తున్నారు. వీరు కూడా రూల్స్‌కు లోబడి సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరసనల పేరుతో హింస
సిటిజన్ షిప్ యాక్ట్ పై ఆందోళన చేసే ముందు ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరికి వ్యతిరేకంగా రోడ్ల పైకి వస్తున్నామో విద్యార్థులు, ప్రజా సంఘాలు ఓసారి ఆలోచించాలి. యాక్ట్ లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. ప్రజలకోసం వెబ్ సైట్లలో కూడా సీఏఏ చట్టాన్ని అందుబాటులో ఉంచాం. పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్లు కూడా యాక్ట్‌ను అర్థం చేసుకోకుండా ఆందోళనల పేరుతో రోడ్ల పైకి వస్తున్నారు. నిరసన ప్రదర్శనల పేరుతో హింసను రెచ్చగొడుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. హింసకు పాల్పడేవారిని, వాళ్లను ప్రోత్సహించేవాళ్లను కూడా వదిలే ప్రసక్తే లేదు. వీళ్లందరినీ చట్టం ముందు నిలబెడతాం. చట్టం పై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటికి సమాధానాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీల అబద్ధాలతో రెచ్చిపోయి ఏ వర్గం ప్రజలు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుతున్నా.

మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం
కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోకూడదు. బీజేపీది పూర్తిగా ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యాన్నే నమ్ముతుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ విధానాలనే అమలు చేస్తే రోడ్లపైకి వచ్చి ఒక్కరు కూడా ఆందోళనలు చేసేవారు కాదు. మన నేతలే దేశ పరువు తీస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన మన నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులే దేశం పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారు. సిటిజన్ షిప్ చట్టం పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత లేకుండా కామెంట్లు చేస్తున్నారు. నిరసన పేరుతో హింసను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు.

రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలు
వాస్తవాలను చూడకుండా ప్రతిపక్షాలు మాత్రం సిటిజన్ షిప్ యాక్ట్‌కు మతం రంగు పులిమాయి. అబద్ధాలు ప్రచారం చేశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలను రెచ్చగొట్టి వారితో ఆందోళనలు చేయిస్తున్నాయి. శరణార్థులుగా మనదేశానికి వచ్చిన వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. అయితే అక్రమ చొరబాట్లను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదు.

ఈశాన్య ప్రజల హక్కులు కాపాడతాం
చట్టాన్ని తయారు చేసేటప్పుడు మనదేశంలోని ఏ వర్గం ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సిటిజన్ షిప్ యాక్ట్ వల్ల తమకు నష్టం జరుగుతుందన్న అనుమానం ఈశాన్య రాష్ట్ర ప్రజల్లో ఉంది. అయితే ఇది కేవలం అనుమానమే. నార్త్ ఈస్ట్రన్ ప్రజల ప్రయోజనాలకు కేంద్రం కట్టుబడి ఉంది. అసోం ఉద్యమకారులతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కుదుర్చుకున్న ఒప్పందం పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ ఒప్పందం అమలు అంశంతో పాటు కొత్తగా వచ్చిన డిమాండ్లు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అస్సాం సివిల్ సొసైటీ పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ రిపోర్ట్ అందిన వెంటనే చర్యలు చేపడతాం.

– జి.కిషన్ రెడ్డి ,
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి