హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ రోడ్లపై జర్నీ చేసేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ రోడ్లపై జర్నీ చేసేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ రోడ్లపై పడుతున్న నిర్మాణ మెటిరీయల్తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రెడీమిక్స్​వాహనాల్లో కాంక్రీట్​మెటిరీయల్ తరలించే టైంలో జాగ్రత్తలు పాటించకపోవడంతోనే రోడ్లపై పడి స్పీడ్​బ్రేకర్ల మాదిరి తయారై యాక్సిడెంట్లకు కారణమవుతోంది. ఎత్తయిన ప్రాంతాల నుంచి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ వంటి హిల్స్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది.

కొన్నిచోట్ల మూల మలుపుల వద్ద పడి గట్టిగా మారడంతో దగ్గరకు వచ్చేవరకూ కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. హిల్స్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కుగా ఉంటే మిగతా ప్రాంతాల్లో రోడ్లపై మట్టి, ఇసుక, కంకరతో వాహనాలు స్కిడ్​అవుతున్నాయి. నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలు ఎలాంటి అడ్డు కట్టకుండా కెపాసిటీకి మించి లోడ్ చేసి తీసుకువెళ్తుండడంతో రోడ్లపై పడుతోంది.

వెయ్యి డేంజర్ స్పాట్లు
గ్రేటర్లో రెడీమిక్స్​వాహనాల కారణంగా నగరంలో వందల రోడ్లు పాడయ్యాయి. వెయ్యికి పైగా డేంజర్​స్పాట్స్​తయారయ్యాయని ఒక అంచనా. ఈ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మైనర్​యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అత్యాధునిక వాహనాలతో రోజూ రోడ్లను క్లీన్​చేస్తున్నామని బల్దియా చెప్తున్నా కాంక్రీట్​పడిన చోట సమస్య పరిష్కారం కావడం లేదు. నిర్మాణ వ్యర్థాలు, కన్ స్ట్రక్షన్ మెటీరియల్ తరలించే వాహనాల యజమానులతో పాటు నిర్మాణదారులు, మెటీరియల్​విక్రయించే వారికి అవగాహన కల్పిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

అప్పటి ఫైర్​ ఇప్పుడేది ?
నిర్మాణ సామగ్రి తరలించే వాహనాల క్యాబిన్ పై నుంచి మెటీరీయల్ బయటకు రాకుండా అడ్డుగా ఏదైనా(టర్ఫాలిన్​మాదిరిగా) కట్టాల్సి ఉంటుంది. రూల్స్​పాటించకుండా ఓవర్ లోడ్ తో వెళ్తే గతంలో బల్దియాలోని ఈవీడీఎంలోని సెంట్రల్ఎన్ ఫోర్స్ మెంట్ చలాన్లు వేసేది. ఒక్కో వెహికల్​కు రూ.25 వేల వరకు జరిమానా విధించేవారు.

రెండోసారి రూ.50 వేలు, అయినా మారకపోతే మూడోసారి వెహికల్​సీజ్ చేసేవారు. బిల్డర్లతో పాటు నిర్మాణ వ్యర్థాలు తరలించే డ్రైవర్లు, విక్రయించే వారికి ఈ విషయంపై అవగాహన కల్పించారు. కొన్నాళ్లు కొంతమేర మార్పు కనిపించింది. ఈవీడీఎం స్థానంలో హైడ్రా ఏర్పడగా, ఎన్ ఫోర్స్ మెంట్ బాధ్యతలు మాత్రం బల్దియా వద్దే ఉన్నాయి. అప్పట్లో మాదిరిగా ఇప్పుడు యాక్షన్​తీసుకోవడం లేదు. 

ఫిలింనగర్​రోడ్డు పూర్తిగా డ్యామేజ్
కాంక్రీట్ మిశ్రమం పడి షేక్ పేట దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా ఫిలింనగర్ వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది. కింది నుంచి పైకి వెళ్లే వరకు స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా పేరుకుపోయింది. రెడీమిక్స్ వాహన డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోంది. బైక్​పై ఇటుగా జర్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటోంది. వేరే రూట్లో వెళ్తున్నా. అధికారులు స్పందించి యాక్షన్​తీసుకోవాలి.

నరేశ్​సాగర్, వాహనదారుడు