సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా: సీఎం రేవంత్

సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఆదివారం (డిసెంబర్ 22) దాడి జరిగిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఓయూ జేఏసీ నేతలు.. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలతో దాడి చేసి ఇంట్లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

‘‘సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‎ను ఆదేశిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

అల్లు అర్జున్ అరెస్ట్‎పై ఏసీపీ విష్ణుమూర్తి ఆదివారం (డిసెంబర్ 22) ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విష్ణుమూర్తి కామెంట్స్‎పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుతో సంబంధం లేదని పోలీసులు ఈ అంశంపై మాట్లాడకుండా ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.