తెలంగాణలో విద్యారంగానిది ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణమైన పరిస్థితి. స్వరాష్ట్రంలో విద్యారంగానికి కేటాయింపులు పెరుగుతాయని, పేద విద్యార్థులందరికీ నాణ్యమైన సర్కారు విద్య అందుబాటులోకి వస్తుందని ఆశించినా.. అవేవీ జరగలేదు. పైగా మునుపటి కంటే పరిస్థితి మరింత దిగజారడం విద్యార్థి లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి, విద్యారంగానికి నిధులు కేటాయింకుండా, నియామకాలు చేపట్టక, మౌలిక వసతులు కల్పించక పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
అరకొర వసతులు, అధ్వాన స్థితిలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఒకవైపు ఆగమైపోతుంటే.. కార్పొరేట్ శక్తులు మాత్రం.. యథేచ్ఛగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఆర్బాటంగా చెప్పుకుంటున్నా.. వాటిలో నాణ్యమైన విద్య, భోజనం, వసతి ఇలా.. అన్నీ నాసిరకంగానే విద్యార్థులకు అందుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యారంగంలో అతి తక్కువ నిధులు కేటాయించే రాష్ట్రం తెలంగాణే.
ఢిల్లీ తన బడ్జెట్ లో విద్యారంగానికి 23.5%, అస్సాం 20.1%, హిమాచల్ ప్రదేశ్18.9% , ఉత్తరాఖండ్ 18.2% , మహారాష్ట్ర 16.3% , చివరకు బీహార్ కూడా తెలంగాణ కంటే ఎక్కువగా తన బడ్జెట్ లో 18.4% విద్యారంగానికి నిధులు కేటాయిస్తున్నది. విద్యకు 2014–15 బడ్జెట్ లో 10.89% నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత క్రమంగా తగ్గిస్తూ 2023–-24 లో 6.24 శాతానికి పరిమితం చేసింది. ఇదీగాక ఉచిత విద్యనందించే బాధ్యత నుంచి సర్కారు తప్పించుకోవాలని చూస్తున్నది. హేతుబద్ధీకరణ పేరుతో సర్కారు బడులను మూసివేసే ప్రయత్నం చేస్తున్నది.
ఉన్నత విద్య పూర్తిగా ప్రైవేటీకరణ
తెలంగాణలో ఇంటర్మీడియట్విద్య పూర్తిగా ప్రైవేటుపరమైంది. ప్రభుత్వ పెద్దల్లో కొందరు విద్యావేత్తల అవతారమెత్తి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు, ఇంజనీరింగ్కాలేజీలు, మెడికల్‌కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టుకుంటూ.. లక్షల్లో ఫీజులు గుంజుతూ.. పేదబిడ్డలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. పేరుకే ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నా.. వాటి భవనాలు శిథిలావస్థలో, తరగతి గదులు బోధకులు లేకుండా ఖాళీగా ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కటి అంటే ఒక్కటి కూడా డీఎల్పోస్టు భర్తీ కాలేదు.
పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు ఆసరాగా తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. దేశంలోనే తమది ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. గత మూడేండ్లుగా 5300 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదో అర్థం కాదు. సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయక పోవడంతో కాలేజీల యాజమాన్యం ఒత్తిడి భరించలేక, ఫీజులు కట్టలేక వేలాది మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
అంధకారంలో యూనివర్సిటీలు
మానవవనరుల వికాస కేంద్రాలైన యూనివర్సిటీలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంధకారంలో ఉన్నాయి. భౌతిక వసతుల లేమి, పడకెక్కిన పరిశోధనలు, నిధుల కొరత, నియామకాల్లో జాప్యం, వర్సిటీ భూములు భూకబ్జాదారులతో రోజు రోజుకు అన్యాక్రాంతమవుతూ ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్, కాకతీయాను
కేంబ్రిడ్జ్ చేస్తామన్న సర్కారు పెద్దల మాటలు నీటిమూటలే అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో 3,179 పోస్టులకు 2,370 అధ్యాపక పోస్టులు అంటే 75 శాతం ఖాళీలు ఉన్నాయి. ఇదీగాక యూజీసీ నిబంధనలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంటూ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీయాలని చూస్తున్నది.
ALSO READ:మాజీ సైనికుడి భూమిని డంపింగ్ యార్డ్‌కు ఎట్లిస్తరు?
మొన్నటికి మొన్న జాతీయ ర్యాంకింగ్ లో ఓయూ సహా అన్ని వర్సిటీల పేలవ ప్రదర్శనకు కారణం ఎవరో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అకడమిక్ స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యంతో నూతన వరవడి సృష్టిస్తూ వెలుగొందాల్సిన విశ్వవిద్యాలయాలు మీతిమీరిన రాజకీయ ప్రమేయంతో అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ప్రభుత్వ బడుల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు నిధుల కేటాయింపు, బోధకులు, ఇతర సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని, బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ప్రైవేటు ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్‌చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్– తెలంగాణ ఆధ్వర్యంలో కదనభేరి నిర్వహించబోతున్నాం. ఆగస్టు 1న సికింద్రాబాద్పరేడ్గ్రౌండ్మైదానంలో నిర్వహించే సభకు విద్యార్థిలోకం కదంతొక్కి రావాలి.
- శ్రీహరి పగిడిపల్లి,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ