- పదేండ్ల నుంచి పైసా మంజూరు కాలే..
- సరస్వతి, స్వర్ణ, కడెం, సదర్ మాట్ కాలువలది అధోగతి
- ప్రతి ఏటా చివరి ఆయకట్టుకు అందని నీరు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాలకు నీరందించే పలు సాగు నీటి కాల్వల పరిస్థితి అద్వానంగా మారింది. ముఖ్యంగా ప్రధాన ప్రాజెక్టుల పరిధిలోని ఈ కాల్వలకు దాదాపు 10 ఏండ్ల నుంచి సరైన రిపేర్లు లేకపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందడంలేదు. దీంతో ఆవేదనకు గురవుతున్న రైతులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీటి కోసం ఆందోళ నలు చేస్తుండడం పరిపాటిగా మారింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం
వర్షాలు, వరదల కారణంగా నిర్మల్జిల్లాలోని ప్రధాన కాలువలు పూర్తిగా దెబ్బతింటూ శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా కాలువలకు లైనింగ్ లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలువల నిండా మొలిచిన పిచ్చి మొక్కలు నీటి ప్రవాహానికి ఆటంకాలు సృష్టిస్తున్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన నీటిపారుదల శాఖ నిధుల కొరత కారణంగా నామ్కే వాస్తే చర్యలతో సరిపెడుతోంది. అండర్ టన్నెల్, సూపర్ ప్యాసేజీ, డిస్ట్రిబ్యూటర్ల రిపేర్లు శాశ్వత ప్రాతిపదికన కాకుండా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కాల్వల రిపేర్లకు నిధులు సక్రమంగా మంజూరు చేయకపోతుండడంతోనే ఈ సమస్య తీవ్రమవుతోంది. దాదాపు పదేండ్ల నుంచి ఈ కాల్వలకు శాశ్వత మరమ్మతులు జరగకపోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలున్నాయి.
దయనీయంగా ప్రధాన కాల్వలు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి కాలువ నిర్మల్ జిల్లాలో దాదాపు 28 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. సోన్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ మండలాలతో పాటు కడెం, ఖానాపూర్ మండలాలకు సైతం ఈ కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ఈ కాలువకు 2001 నుంచి 2004 వరకు దాదాపు రూ.36 కోట్లతో రిపేర్లు చేపట్టారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సరస్వతి కాలువ.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పాలనలోనూ నిరాదారణకు గురైంది. అధికారులు పంపే ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. ఫలితంగా సరస్వతి కాలువకు చాలా చోట్ల బుంగలు పడుతున్నాయి. ప్రతి ఏటా లైనింగ్, కట్ట కొట్టుకుపోతోంది. రిపేర్లు లేక కాలువ శిథిలావస్థకు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో నంబర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి 26వ నంబర్ డిస్ట్రిబ్యూటరీ వరకు ఈ కాలువ ద్వారా మొత్తం 21 వేల 874 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. కడెం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 27, 28వ నంబర్ డిస్ట్రిబ్యూటరీలకు సైతం ఈ కాలువ ద్వారా దాదాపు 7వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ రిపేర్లు లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
మిగతా వాటిదీ ఇదే పరిస్థితి
స్వర్ణ ప్రాజెక్టు పరిధిలోని స్వర్ణ కాలువ, గడ్డన్న వాగు ప్రాజెక్టు పరిధిలోని గడ్డెన్న వాగు కుడి ఎడమ, కాలువలు, సదర్మాట్ ఆనకట్ట పరిధిలోని కాలువల పరిస్థితి కూడా మరమ్మతులు లేక అద్వాన్నంగా మారింది. చాలాచోట్ల నిర్మా ణాలు కొట్టుకుపోయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా కాలువల మధ్యలో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికతో పాటు పిచ్చి మొక్కల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏండ్ల నుంచి ఈ కాల్వలకు రిపేర్లు చేయకపోవడంతో రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రబీ సీజన్లో నీటి ప్రవాహ ఉధృతి తక్కువగా ఉంటుండడంతో పంటలకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఈ కాల్వల రిపేర్లకు నిధులు మంజూరు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రిపేర్లు చేపడుతున్నం
ప్రతి ఏటా కాల్వలకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం. రైతులు ఫిర్యాదులు చేస్తే స్పందిస్తున్నాం. కాల్వల శాశ్వత రిపేర్ల కోసం ప్రతిపాదనలు రూపొందించలేదు.
– లక్ష్మి, ఈఈ, ఇరిగేషన్ శాఖ, నిర్మల్ జిల్లా