రెండో విడత భూములకు.. పరిహారం అందలే

రెండో విడత భూములకు..  పరిహారం అందలే
  • ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత రైతులు
  • రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ కోసం అయోధ్యపురంలో 162 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం 
  • ఏడాది కిందటే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

హనుమకొండ/ కాజీపేట, వెలుగు: కాజీపేటలో రైల్వే వ్యాగన్ మానుఫ్యాక్షరింగ్ వర్క్ షాప్ ఏర్పాటుకు భూములిచ్చిన వారిలో కొందరు రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. వర్క్ షాప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సాగు భూములను తీసుకోవడంతో అక్కడి రైతులు ఉపాధిని కోల్పోగా, కొంతమందికి ఇప్పటికీ పరిహారం అందనేలేదు. ఎన్నిసార్లు విన్నవించినా ఆఫీసర్లు లైట్​ తీసుకోవడం, లీడర్లు పట్టించుకోకపోవడంతో పరిహారం అందని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

162 ఎకరాలు తీసుకున్నరు..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్లతో అంచనాతో కాజీపేటకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్​(పీవోహెచ్​) వర్క్ షాప్ మంజూరు చేసింది. ఈ మేరకు పీవోహెచ్​ను మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు రూ.521 కోట్లతో వ్యాగన్ తయారీ వర్క్ షాప్ గా అప్ గ్రేడ్ చేయగా, 2023 జులై 8న వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉండగా, ఈ వర్క్ షాప్​ ఏర్పాటుకు మొత్తంగా 162 ఎకరాల వరకు అవసరమని రైల్వే శాఖ మొదట్లోనే ప్రతిపాదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట మండలంలోని మడికొండ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను కేటాయించి, అక్కడ దశాబ్ధాలుగా సాగు చేసుకుంటున్న 114 మంది రైతుల భూమిని తీసుకునేందుకు నిర్ణయించింది.

పూర్తి పరిహారం ఇయ్యకుండానే పనులు..

రైల్వే పీవోహెచ్ కోసం గత ప్రభుత్వం మొదటి దఫాలో 150.5 ఎకరాలు రైతుల నుంచి సేకరించి, రైల్వే శాఖకు అప్పగించింది. ఆ తర్వాత ఇంకో 9.03 ఎకరాల స్థలం అవసరం కావడంతో సర్వే నెంబర్ 1173/1 లోని 8 మంది రైతులకు చెందిన ల్యాండ్ ను కూడా సేకరించి, టెండర్లు పిలిచింది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుని పనులు మొదలు పెట్టింది. కానీ, 150.5 ఎకరాలకుగానూ 106 మందికి దాదాపు రూ.60 కోట్లకు పైగా పరిహారం చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం, రెండో దఫా ల్యాండ్ సేకరించిన 8 మంది రైతులను మాత్రం మర్చిపోయింది.

 వారికి రూ.73 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇంతవరకు వారికి పైసా పరిహారం ఇవ్వకుండానే పనులు ప్రారంభించింది. ఆ 9.03 ఎకరాల రైతుల పరిస్థితి ఇటు పరిహారం అందక, అటు సాగు భూమి లేక రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇప్పటికే అన్ని పత్రాలు, వినతులతో పలుమార్లు రెవెన్యూ, రైల్వే అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పరిహారం అందించి, ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

పట్టించుకుంటలేరు..

రైల్వే ప్రాజెక్టు కోసం నాకు సంబంధించిన ఎకరం 38 గుంటల భూమిని తీసుకున్నారు. దానికి పరిహారం కట్టిస్తామన్నారు. ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ చేతిలో ఏమీ లేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి, పరిహారం చెల్లించాలి. - మామిళ్ల రాములు, అయోధ్యపురం

సర్కారోళ్లు చొరవ చూపాలి

రైల్వే ప్రాజెక్టు కోసం మేం సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చి ఉపాధి కోల్పోయినం. నష్ట పరిహారంతోపాటు ఉపాధి కల్పిస్తామని భూమిని తీసుకున్నరు. పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. ఆఫీసర్లను అడిగితే ప్రభుత్వం డబ్బులు ఇవ్వగానే ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చొరవ చూపి పరిహారం అందించేలా చూడాలి.- కాగిత రమేశ్, అయోధ్యపురం