రాష్ట్రంలో పేదోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది : బండి సంజయ్

కొండగట్టు ప్రమాదం జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్నా సీఎం కేసీఆర్ ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్యానికి డబ్బులు చెల్లించలేక బాధితులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రమాద స్థలంలో కేవలం గోడ కట్టించారని, ఇంకేం చేయలేదన్నారు. ఇప్పటికీ చాలా మంది బాధితులు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు రాలేదని, కనీసం బాధితులను కలుస్తామనుకున్న వాళ్లకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

బాధితులకు ఇస్తామన్న ఆర్థిక సహాయం కూడా సరిగా అందించలేదని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇంతమంది పేదలు చనిపోయినా కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్ల పాపం ఊరికే పోదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి.. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు బీజేపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

‘ప్రశ్నించే వాళ్లను తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కళాకారులు మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారు. ఇవన్నీ మానవ హక్కులా..?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రెస్ మీట్ పెడితే ఏ విలేకరైనా ప్రశ్నించే పరిస్థితి ఉందా..? అని నిలదీశారు. కొండగట్టు బాధితులనే ఆదుకోలేని కేసీఆర్​.. దేశ రాజకీయాలను ఏలుతాడా..? అని వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్​ను ఎవరూ పట్టించుకోరని చెప్పారు. ప్రీ పెయిడ్ లీడర్లు, పోస్ట్ పెయిడ్ లీడర్లను పిలిపించుకొని పేపర్లకు ఫొటోలు ఇస్తారని, లోపల ఏం మాట్లాడారన్నది, ఏం జరిగిందన్నది మాత్రం ఎవరికీ తెలియదన్నారు. 

ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఈ నెల 15న ముగింపు కాబోతుందని, మధ్యాహ్నం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు కానున్నారని చెప్పారు. సభా ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్​ పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆనాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బస్సు ప్రమాద మృతుల ఫొటోలు, ఫ్లెక్సీల వద్ద పూలు చల్లి.. నివాళులర్పించారు. అంతకుముందు.. కొండగట్టు బస్టాండ్ సమీపంలో ఉన్న "ఆంజనేయ స్వామి" విగ్రహానికి పూలమాలవేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నాలుగేళ్ల క్రితం కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోయిన విషయం తెలిసిందే. నేటికీ బాధిత కుటుంబాలను కేసీఆర్ సర్కార్ ఆదుకోలేదని బీజేపీ విమర్శిస్తోంది. కనీసం బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కొండగట్టులో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్​.. బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.