అధ్వానంగా రైతు వేదికలు ..​ కరెంట్ కట్​ అవ్వడంతో రైతు నేస్తం కు ఆటంకం

అధ్వానంగా రైతు వేదికలు ..​ కరెంట్ కట్​ అవ్వడంతో  రైతు నేస్తం కు ఆటంకం
  • రెండేండ్లుగా మెయింటనెన్స్​ పైసలు వస్తలేవు 
  • కరెంట్ బిల్లు చెల్లిస్తలే

యాదాద్రి, వెలుగు : మెయింటనెన్స్​ పైసలు రాకపోవడంతో రైతు వేదికల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చివరకు కరెంట్​బిల్లు కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాన్స్​కో స్టాఫ్​ నుంచి అగ్రికల్చర్​స్టాఫ్​కు హెచ్చరికలు వస్తున్నాయి. అడ్డగూడూరులోని రైతు వేదిక కరెంట్​తొలగించడంతో మంగళవారం నిర్వహించే 'రైతు నేస్తం' వీసీ ప్రోగ్రాం ఆగిపోయింది. 

జిల్లాలోని 92 క్లస్టర్లు.. 

వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆధునిక సాగుపై నిరంతరంగా అవగాహన కల్పించడానికి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి రైతు వేదికలను నిర్మించింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 92 క్లస్టర్లను గుర్తించి రైతు వేదికలను నిర్మించారు. వీటి నిర్వహణ కోసం ఒక్కో వేదికకు ప్రతినెలా రూ.9 వేల చొప్పున ఇస్తామని అప్పటి సర్కారు ప్రకటించింది. ఈ సొమ్మును కరెంట్ బిల్లు, స్టేషనరీ, మీటింగ్స్ కోసం ఖర్చు చేయాలని సూచించింది. అయితే అవి కూడా రెగ్యులర్​గా రిలీజ్ చేయలేదు. 2022 చివరిలో ఒకసారి ఫండ్స్​ రిలీజ్ చేసింది. 

మెయింటనెన్స్ లేదు..

రైతు వేదికలకు వాచ్​మెన్​, స్పీపర్​ను నియమించుకోవాలని గతంలో ఆర్డర్స్ జారీ చేసింది. అయితే మెయింటెన్స్ నిధులు రాకపోవడంతో వాచ్​మెన్​, స్వీపర్లను నియమించలేదు. చాలా రైతు వేదికల్లో కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. రైతు వేదికల నిర్వహణలో స్టేషనరీ, మీటింగ్స్​ ఖర్చు సంగతేమో కానీ కరెంట్ బిల్లు సమస్య అగ్రికల్చర్ ఆఫీసర్లపై పడింది. రైతు వేదికలకు సంబంధించి కరెంట్​బిల్లు కొన్నింటిలో రెండేండ్ల పాటు పెండింగ్​లోనే ఉంది. 

కొన్నిచోట్ల ఏఈవోలు తమ జేబు నుంచి ఖర్చు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఒక్కో రైతు వేదిక రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పైగా కరెంట్​బిల్లు బకాయిలు ఉన్నాయి. దీంతో ట్రాన్స్​కో నుంచి అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​కు కరెంట్ కట్​ చేస్తామని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు అగ్రికల్చర్ స్టాఫ్​ పలుమార్లు విన్నవించినా పైనుంచి బిల్లులు రాలేదని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. 

కరెంట్​ కట్.. రైతు నేస్తం బంద్..

ఒక్కో మండలంలోని రైతు వేదికలో ప్రతి మంగళవారం 'రైతు నేస్తం' వీసీ నిర్వహిస్తున్నారు.  యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని రైతు వేదికల్లో ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. హైదరాబాద్​లోని హెడ్డాఫీస్​ నుంచి నిర్వహించే ఈ ప్రోగ్రాం కోసం వీసీ నిర్వహించే రైతువేదికకు కరెంట్, ఇంటర్ నెట్ కనెక్షన్​తప్పనిసరి. అయితే జిల్లాలోని అడ్డగూడూరులోని రైతు వేదికకు సంబంధించిన కరెంట్​బిల్లు రూ.10 వేలకు పైగా బకాయి ఉంది. ఆ రైతు వేదికకు ట్రాన్స్​కో స్టాఫ్​ కరెంట్ కనెక్షన్​తొలగించారు.  దీంతో మోత్కూరులోని రైతు వేదికలో జరుగుతున్న రైతు నేస్తం వీసీకి అడ్డగూడూరు మండల అగ్రికల్చర్​ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ విషయం జిల్లా హయ్యర్ ఆఫీసర్ల దృష్టికి చేరింది. దీంతో ట్రాన్స్​కో ఆఫీసర్లతో మాట్లాడుతున్నట్టుగా 
తెలుస్తోంది.