రాజీవ్ ​స్వగృహ ప్లాట్లను అంటగట్టి..ఆగం జేసిన్రు

  • రాష్ట్రవ్యాప్తంగా జాగలు కొని గోస పడుతున్న  బాధితులు  
  • అధికారుల మెడపై కత్తి పెట్టి మిల్లర్లకు, ఉద్యోగులకు అంటగట్టిన గత సర్కారు
  • రోడ్లు, నీళ్లు, కరెంట్​ సౌకర్యం అన్నరు గాలికి వదిలేసిన్రు అమ్మేద్దామన్నా  కొనే దిక్కు లేదు 

నల్గొండ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్​ స్వగృహ  ప్లాట్స్​ కొన్న బాధితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 2022లో ఓపెన్​ వేలం ద్వారా జనాలకు అంటగట్టిన అప్పటి బీఆర్ఎస్​ సర్కారు తర్వాత పట్టించుకోలేదు. ప్లాట్లు అమ్మడం ద్వారా సుమారు రూ. 5,325 కోట్లు సొమ్ము చేసుకుంది. మార్కెట్​లో స్వగృహ ప్లాట్లకు గిరాకీ లేదని తెలిసినా అప్పుడున్న కలెక్టర్ల మెడపై కత్తి పెట్టి మరీ సేల్​ చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల లీడర్లపై ఒత్తిడి చేసి కొనేలా చేసింది. సివిల్ ​సప్లయీస్, ఎక్సైజ్​ శాఖలతో లింక్​ ఉన్న మిల్లర్లు, వైన్స్ యజమానులను బెదిరించి ఒక్కొక్కరికి రెండు, మూడు ప్లాట్ల చొప్పున అమ్మారు. ప్రభుత్వ ఆఫీసుల్లోని చిరుద్యోగులను కూడా వదిలిపెట్టకుండా వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టొచ్చని ఆశచూపి స్వగృహ జాగలను వదిలించుకున్నారు.  
 
పది జిల్లాల్లో 1408 ప్లాట్లు..

రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్ ​కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న అపార్ట్​మెంట్లు, ఖాళీ జాగాలు కలిపి 1,575 ఎకరాల దాకా ఉన్నట్లు లెక్క తేల్చిన అప్పటి బీఆర్ఎస్​ సర్కార్..వీటి అమ్మకం ద్వారా రూ.5,325 కోట్లు రాబట్టుకుంది. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధ్వర్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులను రంగంలోకి దింపి తాత్కాలిక రిపేర్లు చేయించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో గజానికి రూ.40 వేలు, నల్గొండ జిల్లా నార్కట్​పల్లి, కామారెడ్డిలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున, మహబూబ్​నగర్​ జిల్లా భూత్కూర్, జోగులాంబ గద్వాల జిల్లా, ఆదిలాబాద్​లో రూ.8 వేలు ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో రేటు ఫిక్స్​ చేసి బహిరంగ వేలం నిర్వహించింది. 

అప్పుడున్న ప్రైవేటు వెంచర్లతో పోలిస్తే రేట్లు భారీగా ఉన్నాయని ఎవరూ ముందుకు రాకపోవడంతో కొంత సడలింపు ఇచ్చింది. దీంతో ముందు వరుసలోని కమర్షియల్, రెసిడెన్షియల్​ ప్లాట్లకు డిమాండ్​ పలికింది. తర్వాత వెంచర్లలోని చివరి ప్లాట్లు అమ్మేందుకు రెండు, మూడు విడతలుగా టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో వదిలేసింది.   

ఉప్పల్​ భగాయత్​ రీతిలో అద్భుతమంటూ...

హైదరాబాద్​లోని ఉప్పల్​ భగాయత్​ రీతిలో జిల్లాల్లోని స్వగృహ ప్లాట్లను తీర్చిదిద్దుతామని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫండ్స్​తో స్వగృహ వెంచర్లను డెవలప్​​ చేస్తానని అప్పటి బీఆర్ఎస్​ సర్కారు కొనుగోలుదారులకు హామీ ఇచ్చింది. 40 ఫీట్ల రోడ్లు, పార్కులు, అండర్ గ్రౌండ్​ డ్రైనేజీ, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని మభ్యపెట్టింది. దీంతో నమ్మి కొన్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అప్పుడు బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని బోరుమంటున్నారు. ఇప్పుడు స్వగృహ ప్లాట్లు ఉన్న ప్రాంతాలు కంప చెట్లతో నిండిపోయాయి. వానలకు వరద వచ్చి చేరుతుండడంతో కుంటలను తలపిస్తున్నాయి. 

ఇప్పుడు రేట్లు డౌన్​...

వేలంలో పెట్టిన రేట్లు ఎక్కువగా ఉన్నాయని కొనేం దుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నల్గొండ లాంటి జిల్లాలో చదరపు గజం రూ.7వేలకు మించి పలకలేదు. కమర్షియల్​ ప్లాట్లు మాత్రం రూ. 13,500కు కొన్నారు. నుడా, సుడాల పేరుతో పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ​సర్కార్​ ఆ నిధులతోనే స్వగృహ ప్లాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని చెప్పి హ్యాండిచ్చింది. 

అప్పుడు స్వగృహ ప్లాట్ల పరిసర ప్రాంతాల్లో వెలసిన వెంచర్లలో ప్లాట్ల రేట్లు ఇప్పుడు డబుల్ ​అయ్యాయి. కానీ, స్వగృహ ప్లాట్లకు మాత్రం డిమాండ్ ​రాలేదు. నల్గొండలాంటి చోట్ల స్వగృహ భూములు చౌడు నేలలు కావడంతో పిల్లర్లు వేయడానికి పది, పదిహేను ఫ్లీట్ల అడుగుల్లో తవ్వాల్సి వస్తదని స్థానికులు చెప్తున్నారు.  మార్కెట్​లో  ప్రైవేటు వెంచర్ల ప్లాట్లకే గిరాకీ లేదని, కొన్న రేట్లకు అమ్ముదామన్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని బాధితులు వాపోతున్నారు. 

కామారెడ్డి జిల్లాలో ఇలా...

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో హైవే పక్కన 50 ఎకరాల్లో రాజీవ్ స్వగృహ కింద ధరణి టౌన్ షిప్​పేరిట ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. వివిధ కేటగిరిల్లో 543 ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టగా, 313 వివిధ స్టేజీల్లో ఉన్నాయి. 230 ఓపెన్ ప్లాట్లున్నాయి.  గత బీఆర్ఎస్ సర్కారు  2022 నుంచి నాలుగు విడతల్లో వేలం ద్వారా 351 ఇండ్లు, ప్లాట్లు అమ్మి రూ.50.71  కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. 

అయితే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు మాత్రం కల్పించలేదు. వేలానికి ముందు మాత్రం తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసి,  నిర్మాణాలు అగిపోయిన ఇండ్ల కోసం, ఏరియా క్లీనింగ్ ​కోసం మున్సిపల్, కలెక్టర్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు ఖర్చు చేసింది. ఇతర వసతుల కల్పనకు రూ.12.43 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.75 లక్షలతో కరెంట్ ​లైన్​, పోల్స్, ట్రాన్స్​ఫార్మర్ ​బిగించారు. మిగతా ఏ పనులు చేపట్టలేదు. ఇక్కడ కొన్నవారు ఉండడానికి వసతులు లేవు.