
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన వద్ద పాలన యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నది. నిత్యం వేలాది మంది పేషంట్లు, వారి అటెండెంట్లతో రద్దీగా ఉండే హాస్పిటల్ పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, గమనించిన లోపాలు, వైద్యుల గైర్హాజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీఎంఈ డాక్టర్ నరేందర్ కుమార్ కూడా ఆసుపత్రిని విజిట్ చేశారు.
పలు చోట్ల ఉన్న మట్టి కుప్పలను, మురుగును తొలగించాలని ఆదేశించారు. మంత్రి, డీఎంఈ ఆదేశించి వారం గడిచినప్పటికీ అధికారుల్లో మాత్రం స్పందన కనిపించడం లేదు. ఇంకా పరిసరాలను శుభ్రం చేయడం లేదు. దీంతో సాక్షాత్తు మంత్రి ఆదేశాలనే పట్టించుకోని అధికార యంత్రాంగం ఇక తమ బాధలేం పట్టించుకుంటుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.