బెయిలు​ మంజూరులో..చట్టం పరిధికి మించి షరతులు

బెయిలు​ మంజూరులో..చట్టం పరిధికి మించి షరతులు

బెయిలు​ మంజూరు చేసినప్పుడు కోర్టులు కొన్ని ఆంక్షలని విధిస్తాయి. అయితే, అవి చట్టప్రకారం ఉండాలి. న్యాయమూర్తుల ఇష్టానుసారంగా షరతులు ఉండటానికి వీల్లేదు. ఇటీవల కాలంలో కోర్టులు బెయిలు మంజూరు చేస్తున్నప్పుడు విధిస్తున్న షరతులను గమనించినప్పుడు ఆశ్యర్యం వేస్తోంది. జిల్లా కోర్టు న్యాయమూర్తులు ఈవిధంగా విధిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది.  

అలాంటిది రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు విధిస్తే  మరింత ఆందోళన కలుగుతుంది. వాళ్లకి న్యాయమూర్తులు అయిన తరువాత శిక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందా అని కూడా అనిపిస్తోంది.  ఓ వివాహ సంబంధమైన కేసులో పాట్నా హైకోర్టు జారీచేసిన బెయిలు ఉత్తర్వుని సుప్రీంకోర్టు మార్చివేసింది. శ్రీకాంత్​కుమార్​ వర్సెస్​ స్టేట్ ఆఫ్​ బిహార్​ కేసులో హైకోర్టు వింతైన షరతులను విధించింది. 

కేసు గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. సుప్రీంకోర్టుకి వచ్చిన అప్పీలుదారు భర్త.  అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్​ 498 ఎ, 379, అదేవిధంగా వరకట్న నిషేధిత చట్టంలోని సెక్షన్​ 4 ప్రకారం కేసు నమోదైంది.  ఆ కేసులో అరెస్టు గురించి భయపడి ముందస్తు బెయిలు కోసం పాట్నా హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పీలుదారు తన భార్యకు భరణం ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచాడని హైకోర్టు పేర్కొంటూ అతని భార్య ఖాతాలో నెలకు రూ.4వేలు జమ చేయాలని షరతును విధించింది.  అప్పీలుదారు వరుసగా రెండు నెలలు భరణం చెల్లించడంలో విఫలమైతే అతని బెయిలును రద్దు చేయడానికి కింది కోర్టుకి స్వేచ్ఛని ఇచ్చారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ అప్పీలుదారు  సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు.

అప్పీలుదారుకి వివాహం ఇష్టంలేదని, కానీ, అతను వివాహం చేసుకునేవిధంగా ఒత్తిడి తీసుకువచ్చి వివాహం చేశారని, ఆ వివాహం రద్దుకోసం అతను దరఖాస్తు చేశాడని అతని న్యాయవాది సుప్రీంకోర్టుకి విన్నవించాడు. బెయిలులో అలాంటి షరతులని విధించడం సమంజసం కాదని కూడా కోర్టుకి చెప్పారు. ఈ వాదనలకి భిన్నంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలని వినిపించాడు.  

అప్పీలుదారు అంగీకరించిందువల్లనే హైకోర్టు అలాంటి షరతులని  విధించిందని కూడా చెప్పాడు.  ఇరువురి వాదనలు విన్న తరువాత  పాట్నా హైకోర్టు విధించిన షరతులు సమంజసంగా లేవని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇంకా ఇలా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘బెయిలు కోసం దరఖాస్తు దాఖలు చేసినప్పుడు,  అప్పీలుదారు (ముద్దాయి) చట్టం పరిధి నుంచి పారిపోకుండా, న్యాయానికి అందుబాటులో ఉండేవిధంగా అవసరమైన షరతులని మాత్రమే కోర్టు విధించాల్సి ఉంటుంది.  ముందస్తు బెయిలు మంజూరు కోసం అవసరమైన షరతులని మాత్రమే విధించాలి. అంతేకానీ, అలా రెండు నెలలు వేయకపోతే  బెయిలుని రద్దు చేసే  స్వేచ్ఛ దిగువ కోర్టుకు ఉంటుందని ఆదేశాలని జారీచేయడం సరైంది కాదు’ అని ఆ షరతులను సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.    

హైకోర్టుల వింత షరతులు

హైకోర్టులు ఇలాంటి ఉత్తర్వులను షరతులని విధించడం మొదటిసారి కాదు. గతంలో చాలా కేసుల్లో ఇంతకన్నా వింతైన  షరతులని విధించి నవ్వులపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రముఖమైనది అపర్ణాభట్ ఆఫ్​ మధ్యప్రదేశ్​, హైకోర్టు న్యాయమూర్తి పేరు రోహిత్​ ఆర్యా.  ఓ మహిళా గౌరవానికి భంగం కలిగించాడన్న కారణంగా ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. 

కోర్టు అతనికి బెయిలు మంజూరు చేస్తే ఆ ముద్దాయి ఆ మహిళ ఇంటికి వెళ్లి  రాఖీ కట్టమని అభ్యర్థించి రాఖీ కట్టించుకోవాలి. అంతేకాదు రాబోయే అన్ని సమయాల్లో తన శక్తి సామర్థ్యాల మేరకు ఆమెను కాపాడతాను అని వాగ్దానం చేయాలి. అక్కడితో  న్యాయమూర్తి ఊరుకోలేదు. రాఖీ కట్టినప్పుడు సోదరులు తన సోదరిలకు ఇచ్చే కానుక మాదిరిగా అతను ఆమెకు రూ.11000 చెల్లించాలని,  ఆమె కుమారుడు విశాల్​కు రూ.5000 బట్టలు కొనుక్కోవడానికి ఇవ్వాలన్న షరతులను బెయిలు  ఉత్తర్వుల్లో రాశారు.ఈ పనులు చేసినట్టుగా ఫొటోలు తీసి హైకోర్టు రిజిష్ట్రార్​కి సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆర్యా ఆదేశించారు. 

ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. లాక్​డౌన్​ కాలంలో షరతులను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి బెయిలు మంజూరు చేస్తూ అతను వారం రోజులపాటు స్వచ్ఛందంగా సేవ చేయాలని మధ్యప్రదేశ్​హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్​ శ్రీ వాత్సవ బెయిలు షరతుని విధించారు. అదేవిధంగా తాము ఏమీ తీసిపోలేదన్నట్టుగా...పాట్నా హైకోర్టు హత్య కేసులోని ముద్దాయికి బెయిలు మంజూరు చేస్తూ అతను విడుదలయిన తరువాత 3 నెలలుపాటు కొవిడ్​ కాలంలో స్వచ్ఛందంగా సేవ చేయాలన్న షరతుని విధించారు.  మరో కేసులో మధ్యప్రదేశ్​ హైకోర్టు ఇద్దరు  ముద్దాయిలకు ఓ కేసులో బెయిలు మంజూరు చేస్తూ వాళ్లు కలర్​ఎల్ఈడీ  టీవీని  కొని  జిల్లా  ఆసుపత్రిలో పెట్టాలని ఆదేశించారు. అది చైనాలో కొన్నది అయి ఉండకూడదన్న షరతుని కూడా విధించారు.  మధ్యప్రదేశ్​ హైకోర్టు ఇలాంటి షరతులు విధించడంలో ఓ అడుగు ముందుంది. 

అత్యధిక షరతులు

బెయిలుని మంజూరు చేసినప్పుడు, అదేవిధంగా శిక్షని సస్పెండ్ చేసినప్పుడు అత్యధిక షరతులని విధించడం సమంజసం కాదు. అలాంటి షరతులని విధిస్తే బెయిలు తిరస్కరించడంతో సమానం. అలాంటి ఓ కేసులోని షరతులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కృష్ణ మురారి,  రామసుబ్రమణియన్​ల  బెంచి తోసిపుచ్చింది.  రూప్​నారాయణ్​ అనే వ్యక్తిని 307, 323, 341 ఐపీసీ ప్రకారం దోషిగా సెషన్స్​కోర్టు నిర్ధారించింది. 

అతనికి పదేండ్లు జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ శిక్షను అప్పీలులో రాజస్తాన్​ హైకోర్టు నిలిపివేసింది. అయితే, జరిమానా మొత్తాన్ని (లక్ష రూపాయలు) డిపాజిట్​ చేయాలని, అదేవిధంగా రూ.లక్ష  పూచీకత్తుని,  రూ.50వేల చొప్పున రెండు బాండులని సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులని సవాలు చేస్తూ అతను సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఈ  ఆదేశాలని జారీ చేసింది. నిందితుల కదలికలను నిరంతరం ట్రాక్​ చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాంటి షరతులని బెయిలు మంజూరు చేసేటప్పుడు విధించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

గూగుల్​ మ్యాప్​లో పిన్​ వేయాలన్న షరతుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తీర్పుని చెబుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి  ఇలా అభిప్రాయపడ్డారు. ముద్దాయి వ్యక్తిగత జీవితంలోకి దర్యాప్తు ఏజెన్సీ వెళ్లేవిధంగా షరతులు విధించడం అంటే అతనికి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే.  చట్టం ఒకరకంగా ఉన్నప్పుడు  మరో రకంగా షరతులని విధించడం ఎందుకు జరుగుతుంది?  న్యాయ మూర్తులు చట్టం పరిధి దాటి ఉత్తర్వులను జారీ చేయడానికి కారణం ఏమిటి?  వారికి సరైన ట్రైనింగ్​ లేకపోవడమా.. రాజ్యాంగం ఇచ్చిన విస్తృత అధికారాల వల్ల ఏర్పడిన అధికార బలమా? ఇది జాతీయ జ్యుడీషియల్​ అకాడమీ ఆలోచించాల్సిన విషయం.

- డా. మంగారి రాజేందర్,జిల్లా జడ్జి (రిటైర్డ్​)-