రైతు భరోసాకు కండిషన్లు పెట్టలే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  •  వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రిపోర్ట్​ సభ ముందుంచుతామని వెల్లడి
  • నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోం: మంత్రి పొంగులేటి
  • అర్హులైన వారికే రైతు భరోసా ఇస్తం: మంత్రి తుమ్మల
  • రైతు బంధు భూస్వాములకే లబ్ధి చేసింది: మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు: తాము రైతు భరోసాకు ఇప్పటివరకూ ఎలాంటి కండిషన్లు పెట్టలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడు రైతుల నుంచి అభిప్రాయాలు మాత్రమే స్వీకరిస్తున్నామని, వారి ఒపీనియన్లకు తగ్గట్టుగానే రైతు భరోసా విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా సదస్సు నిర్వహించారు. 

విధివిధానాల ఖరారుపై  అదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైతుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు, సలహాలను  సేకరించింది. సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాజరయ్యారు. సబ్ కమిటీ ముందు రైతులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. 

కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కొంత మంది రైతులు కోరగా.. మరికొందరు కౌలు రైతుకు సగం.. పట్టదారుడికి సగం రైతు భరోసా ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులకు పక్కనపెట్టి పేద, దళిత గిరిజన రైతులకు అందించాలని పలువురు అన్నదాతలు కోరారు. వర్షాధారంపైనే  తాము పంట సాగు చేస్తున్నామని, ఖర్చులు పోను ఏమీ మిగడం లేదని చెప్పారు.  

వెనకబడిన అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పది ఎకరాలు సాగు చేసే రైతులందరికీ తప్పకుండా రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఏజెన్సీ రైతులకు ఎలాంటి పరిమితులు లేకుండా సాయం అందించాలని చెప్పారు. పోడు భూములు సాగు చేసుకునే రైతును కూడా అర్హుడిగా గుర్తించాలని కోరారు. రైతు భరోసాను రేషన్ కార్డుతో లింకు పెట్టకూడదని పలువురు రైతులు అన్నారు.  

ఏజెన్సీలో విరాసత్ పట్టాలు ఇవ్వాలని, చనిపోయిన వారిపేరు మీద పట్టాలు ఉండటంతో పెట్టుబడి సాయం అందడం లేదని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, నగేశ్, చెన్నూర్ ఎమ్మెల్యేలు వెంకటస్వామి, వెడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్ రావు, పాయల్ శంకర్, కోవ లక్ష్మి, రామరావు పటేల్, అనిల్ జాదవ్, పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ తో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్లు  పాల్గొన్నారు. 

అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసాపై చర్చ: భట్టి

అన్ని జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ  పర్యటించి.. ప్రజాక్షేత్రం లో  అభిప్రాయాలు సేకరిస్తుందని, వాటన్నింటినీ క్రోడీకరించి నివేదిక రూపంలో శాసన సభ ముందుంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీనిపై శాసన సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అర్హులందరికీ పెట్టుబడి సాయం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూస్తామని చెప్పారు. అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకు రైతు భరోసాపై చర్చించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద, బడుగు వర్గాలకు న్యాయం చేసేలాగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా సాయం పై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదని, గ్రామం యూనిట్​గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు  సూచిస్తున్నారని తెలిపారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టిన తర్వాత ఆ నిధులను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌‌‌‌ పెడుతుందని తెలిపారు. ఆ సమయంలోనే రైతుభరోసా అమలుపై విధివిధానాల రూపకల్పన చేస్తామని చెప్పారు. 

అర్హత ఉన్నోళ్లకే భరోసా: మంత్రి తుమ్మల

అర్హత ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు రైతుల సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఉమ్మడి జిల్లాల్లో  సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

ప్రతి పైసా పేదలకు అందిచడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు తీసుకోబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  ప్రతి పైసా పేదవారికి అందాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

‘‘మా మనస్సుల్లో ఏమీ లేదు. కొండలు, గుట్టలు, ఫార్మ్ హౌస్ లు ఉన్న వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలా? లేదా? అనేది మీరే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో భూమికి సరైన పత్రాలు కూడా లేవు. అసెంబ్లీ లో సైతం అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. అర్హులైన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది”అని తెలిపారు. 
 
పదేండ్లలో పేదోళ్లు పేదోళ్లలాగే ఉండిపోయారు: మంత్రి సీతక్క 

తెలంగాణలో పదేండ్లలో పేదోళ్లు పేదోళ్లలాగానే ఉండిపోయారని, భూస్వాములు వందల ఎకరాలకు కోట్ల రూపాయల రైతుబంధు తీసుకొని లబ్ధి పొందారని మంత్రి సీతక్క అన్నారు. పేదలకు ఏ విధంగా లబ్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు. అందుకే ప్రజాభిప్రాయం తీసుకొని, అందరికీ న్యాయం చేసేందుకే ప్రజా క్షేత్రంలోకి వస్తున్నామని తెలిపారు.

చాలా మంది భూములు అమ్ముకొని పోయిన భూస్వాములు కూడా ఇప్పుడు మళ్లీ వస్తున్నారని, తమకు కేసీఆర్ పట్టా ఇచ్చారని, రైతుబంధు వస్తుందని అంటున్నారని చెప్పారు. మరి ఏండ్లుగా మోఖా మీద ఉండి సాగు చేసుకుంటున్న వారికి న్యాయం చేయడం ఎలా అనే దానిపైనే అభిప్రాయ సేకరణ చేపట్టామని తెలిపారు.  

ధరణిలో మార్పులతో రైతులకు న్యాయం: ఎంపీ గడ్డం వంశీ 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ  నిర్లక్ష్యంతో ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలను పరిష్కరించి, అందులో మార్పులు చేస్తున్నదని, దీంతో రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.  రైతుభరోసా ద్వారా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. 

 ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సద స్సులు నిర్వహించి, వారి ద్వారానే అభి ప్రాయ సేకరణ చేయడం గొప్ప విషయ మని అన్నారు. ఇంత మంచి సమావేశం పెట్టినందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నారు. గత పదేండ్లు రాష్ట్రంలోని రైతులు అరిగోసలు పడ్డారని, వారికి న్యాయం చేస్తామని చెప్పారు.  

కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే వివేక్

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన 50 శాతం మంది కంటే ఎక్కువ కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారికి వంద శాతం న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కౌలురైతుకూ రైతుభరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

 ఫసల్ బీమా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.  మిగతా రైతులలాగే పోడు భూముల రైతులకు కూడా రైతు భరోసాని అమలు చేస్తూ.. పట్టాలు కూడా మంజూరు చేయాలని కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత శాఖ మంత్రులు వీటిపై దృష్టి సారించి ఫారెస్టు అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని వివేక్​ కోరారు.  

ప్రతి ఏడాది సవరించాలి

కౌలు రైతులకు సైతం రైతు భరోసా అమలు చేయాలి. అది ప్రతి ఏడాది సవరణ చేస్తేనే నిజమైన వారికి లబ్ధి జరుగుతుంది. పదెకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. నిజమైన పంట పండించే రైతుకు ఇవ్వడం ద్వారానే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. పంట బీమా అమలు చేయడం ద్వారా పంట నష్టం జరిగినప్పుడు లబ్ధి చేకూరుతుంది. 

 శ్రీకాంత్ రెడ్డి, రైతు సంఘం నేత

సాయం సమానంగా పంచాలి

మా ఏజెన్సీలో సాగు భూములు ఉన్నోళ్లు కూడా చాలా మంది పేదోళ్లు ఉన్నరు. ఇందులో కౌలుకు సాగు చేసుకునే రైతులకు సగం భరోసా ఇవ్వాలి. పట్టదారుడికి సగం డబ్బులు ఇవ్వాలి. ఎన్ని ఎకరాల లిమిట్​ పెట్టినా.. సాయం మాత్రం సగం సగం పంచాలి.

 మెస్రం జంగు, రైతు

కౌలు రైతుకు న్యాయం చేయాలి

సాగులో లేని  భూములకు రైతు భరోసా ఇవ్వద్దు. అసలైన రైతులకే పథకాన్ని వర్తింపజేయాలి. రైతు భరోసా ఇచ్చి కౌలు రైతులకు న్యాయం చేయాలి. గతంలో తీసుకొచ్చిన 2011 కౌలు రైతు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది. 

 కరుణాకర్, రైతు