కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో పెషేంట్లకు అవస్థలు

ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి..

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో వారం రోజులుగా ఎక్స్​రే మిషన్ పని చేయడం లేదు. ఇప్పటికే హాస్పిటల్‌లో సీటీ స్కాన్​ మిషన్‌ లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితిలో సీటీ స్కాన్​ కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు భరించాల్సి వస్తోంది. తాజాగా ఎక్స్ రే మిషన్ కూడా పని చేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. టెక్నికల్​ విభాగానికి కూడా వివరాలు పంపారు. కానీ రోజులు గడుస్తున్నా.. రిపేర్ మాత్రం కాలేదు.  

పరిస్థితి ఇది..

జిల్లా హాస్పిటల్‌కు రోజు  600 నుంచి 700 మంది వరకు ఓపీ పెషెంట్లు వస్తారు. ఎమర్జెన్సీ కేసులు కూడా వస్తాయి. హైవేలు, స్టేట్​హైవేలు,  జిల్లా రోడ్లపై నిత్యం పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇందులో కొందరికి కాలు, చేతులు, శరీర భాగాలు విరుగుతాయి. యాక్సిడెంట్‌కు గురైన వారితో పాటు, రోజుల తరబడి జ్వరంతో బాధ పడే వారికి,  ఇతర  కొన్ని అనారోగ్య ప్రాబ్లమ్స్​వచ్చే వారిలో కొందరికి ఎక్స్​రే తీయాల్సి వస్తోంది. ఇక్కడ ప్రతి రోజు 70 నుంచి  85 మందికి ఎక్స్​రేలు తీస్తారు. అయితే వారం రోజులుగా మిషన్‌ పని చేయకపోవడంతో పెషేంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్​రే కోసం పెషేంట్లు  తిరగాల్సి వస్తోంది. కొందరు ప్రైవేట్‌కు వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఎక్స్​రే మిషన్​ను రిపేర్​ చేయించాలని రోగులు కోరుతున్నారు. 

కామారెడ్డి టౌన్‌లోని అజాంపూరకు చెందిన రెష్మా స్థానిక గవర్నమెంట్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతోంది. ఐదు రోజుల కింద స్కూల్‌లో అడుకుంటూ కింద పడగా కాలు ప్రాక్చర్‌‌ అయ్యింది. ట్రీట్‌మెంట్‌ కోసం జిల్లా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. స్టూడెంట్‌ కాలును పరిశీలించి పట్టి వేశారు. ఎక్స్ రే మిషన్‌ పని చేయడం లేదని మరొక రోజు రమ్మని పంపించారు. మరుసటి రోజు వస్తే ఇంకా ఎక్స్​రే మిషన్‌ రిపేర్ కాలేని తిప్పి పంపారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా.. ఎక్స్‌ రే మాత్రం తీయలేదు. హాస్పిటల్‌కు వచ్చినప్పుడల్లా రానుపోను రూ.120 ఖర్చవుతోందని రేష్మా తల్లి అసియాబేగం పేర్కొంది.
ఈ మహిళ రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన సలావత్ యమున. చాతిలో నొప్పి వస్తుండడంతో  కొడుకు రాజు తల్లిని ఆటోలో తీసుకుని కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌కు వచ్చారు. డాక్టర్ చూసిన తర్వాత చెస్ట్‌ ఎక్స్​రే తీయాలని సూచించారు. తీరా ఎక్స్​రే రూమ్​ వద్దకు వస్తే మిషన్ పనిచేయడం లేదని అక్కడ ఉన్న స్టాఫ్‌ చెప్పడంతో వారు వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

రిపేర్​ చేయిస్తాం..

ఎక్స్​రే మిషన్ రిపేర్​ కోసం కంపెనీ ప్రతి నిధులకు తెలియజేశాం. రిపేర్​ చేయడా నికి  వస్తామని చెప్పారు. కానీ ఇంకా రాలేదు. త్వరగా రిపేర్​చేయించడానికి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం.

- డాక్టర్ శ్రీనివాస్, 
ఆర్ఎంవో, జిల్లా హాస్పిటల్​