పరీక్షగా మారిన కరోనా టెస్టులు
మధ్యాహ్నం 12 గంటలకే పలు సెంటర్లు క్లోజ్
కొన్ని చోట్ల కిట్ల షార్టేజ్
మొబైల్ వెహికల్స్ కూడా బంద్
యాంటీ జెన్ టెస్టులపైనా ఫోకస్ కరువు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో కరోనా టెస్టులు పరీక్షగా మారాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సిటీలో 97 సెంటర్లలో యాంటీజెన్, 9 సెంటర్లలో ఆర్ టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. టెస్టుల కోసం వెళ్తే పలు సెంటర్ల దగ్గర శాంపిల్స్ తీసుకోవడం లేదు. కొన్ని చోట్ల కిట్లు లేవంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు. మరికొన్ని సెంటర్లను మధ్యాహ్నం 12లోపే క్లో జ్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వారికి రే పు రమ్మనే సమాధానమే వినిపిస్తోంది. మరోవైపు అసలు ఆర్ టీ పీసీఆర్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన మొబైల్ వె హికల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఇప్పుడవెక్కడా కనిపించడం లేదు. మానిటరింగ్ చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సెంటర్లలో టెస్టులు జరుగుతున్నాయో, లేదో కూడా తెలుసుకోవడం లేదు. పీహెచ్ సీ , బస్తీ దవాఖానాల్లో చేసే యాంటీజెన్ టెస్టులపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. సెంటర్లలో కిట్లు షార్టేజ్ ఉన్నా, టైమ్‌కు రాకున్నా పట్టించుకునే వారే లేరు. దాంతో సస్పెక్టర్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఆందోళన చెందుతున్నారు.
90 శాతం యాంటీజెన్ లే..
యాంటీజెన్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన వారికి కూడా ఆర్ టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వస్తుండడంతో సస్పెక్టర్ ఆర్టీపీసీఆర్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రిజల్ట్కు టైమ్ పట్టినా అవే చేయించు కోవాలనుకుంటున్నారు. సర్కార్ సెంటర్లలో కుదరకపోతే ప్రైవేట్ లో చేయించుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం యాంటీజెన్ 90 శాతం చేస్తే.. ఆర్టీ పీసీఆర్ టెస్టులు 10 శాతం చేస్తోంది.
రికమండేషన్ ఉంటేనే ..
సిటీలో గాంధీ, ఉస్మానియా, ఫీవర్, సీసీఎంబీ, ఐపీఎం, నిమ్స్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, లాలాగూడ రైల్వే హాస్పిటల్లో ఆర్ టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. చాలా వరకు సెంటర్లలో రికమెండేషన్ తో వెళ్లిన వాళ్ల శాం పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి . నేరుగా వెళ్లిన వారికి నిమ్స్‌లో టెస్టులు చేయడం లేదు.
6 నుంచి ఒకటికి తగ్గి న మొబైల్ వెహికల్స్
జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్ టీ పీసీఆర్ టెస్టులు చేసేందుకు కొద్ది రోజుల కిందట 6 మొబైల్ వె హికల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో వెహికల్ లో డైలీ వెయ్యి వరకు శాంపి ల్స్ తీసుకునేవాళ్లు. కాలనీకే వచ్చి టెస్ట్ చేస్తుండడంతో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా వాటిని ఆపేశారు. ఇప్పుడు ఒక్క వె హికల్ లో మాత్రమే శాంపిల్స్ కలెక్షన్ జరుగుతోంది. దాంతో వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో, అసలు వస్తున్నాయో.. లేదో తెలియక జనం గందరగోళ పడుతున్నారు. కొందరు హాస్పిటల్స్ కి పరుగులు తీస్తున్నారు.