
యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల అవస్థలు
యూజీసీ పేస్కేల్ రావాలె.. కానీ జీతం 20 వేలు మించుతలేదు
పీఎఫ్, హెల్త్ కార్డులూ లేవ్.. ఒక్కో వర్సిటీలో ఒక్కోలా శాలరీలు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు.. సర్వీసులో చనిపోయినా పైసా ఇస్తలేరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ స్టూడెంట్లకు పాఠాలు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవస్థలు పడుతున్నారు. పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు.. ఇలా రకరకాల పేర్లతో పని చేస్తున్న వీరికి జాబ్ సెక్యూరిటీ కరువైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల ప్రకారం వీళ్ల కొలువుపెద్దదే అయినా.. యూజీసీ పే స్కేల్ మాత్రం అమలు కావడం లేదు. కనీసం పీఎఫ్, హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ కూడా అందడం లేదు. ఓయూ, కేయూలో ఇలా15, 20 ఏండ్లుగా పని చేస్తున్న15 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు రిటైర్ కూడా అయ్యారు. వచ్చే ఏడాది మరో30 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఉద్యోగంలో ఉండగా చనిపోయిన వాళ్లకు వర్సిటీ పాలక వర్గాలు నయా పైసా కూడా ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
పార్ట్ టైం వాళ్లే ఎక్కువున్నరు..
యూనివర్సిటీల్లో పార్ట్‌టైం, కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, రెగ్యులర్ఫ్యాకల్టీ అనే నాలుగు కేటగిరీలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే మూడింతలు మిగతా మూడు కేటగిరీల అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఉన్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే పూర్తిగా కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లతోనే నడుస్తున్నాయి. ఓయూలో 385 మందిపర్మినెంట్ఫ్యాకల్టీ ఉంటే.. 875 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైంవాళ్లు ఉన్నారు. కాకతీయలోపర్మినెంట్ ఫ్యాకల్టీ111 మంది ఉండగా, కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు 413 మంది ఉన్నారు. మహత్మాగాంధీ వర్సిటీలో 25 మంది పార్ట్ టైం, 51 మంది అకడమిక్ కన్సల్టెంట్లు, శాతావాహనలో 30 మంది కాంట్రాక్ట్, 23 మంది పార్ట్‌టైం లెక్చరర్లు పని చేస్తున్నారు.
ఒక్కో వర్సిటీలో ఒక్కోలా శాలరీలు..
యూజీసీ గైడ్లైన్స్ప్రకారం పార్ట్ టైం, కాంట్రాక్ట్లెక్చరర్లకు ఒక్కో పీరియడ్‌కు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి ఉండగా రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలోనూ ఇది అమలు కావడం లేదు. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. పాలమూరు వర్సిటీలో పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లకు ఒక్కో పీరియడ్ కు రూ.300, సెల్ఫ్ ఫైనాన్స్ పార్ట్ టైం లెక్చరర్లకు నెలకు రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. తెలంగాణ వర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్లకు ఒక్కో పీరియడ్ కు రూ.400, నెట్, పీహెచ్డీ ఉంటే రూ.500 ఇస్తున్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీల్లో రెగ్యులర్ కోర్సుల్లో పీరియడ్‌కు రూ.700, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో రూ.450(కేయూ), రూ.370(ఎంజీయూ) చెల్లిస్తున్నారు. శాతవాహనలో పీరియడ్ కు రూ.700 ఇస్తున్నారు. అన్ని పీరియడ్స్ కు బిల్లులు పెట్టుకుంటే నెల జీతం రూ.20 వేలకు మించడం లేదు. హాలి డేస్ఎక్కువగా వచ్చే నెలలో రూ.10 వేలు కూడా మించడం లేదని పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎంపీ కొడుకుకు జాబ్..
కాకతీయలో110 మంది పార్ట్‌టైం లెక్చరర్లు పని చేస్తున్నారు. నెలనెలా శాలరీస్ తీసుకునేలా తమను అకడమిక్ కన్సల్టెంట్లు (ఏసీ)గా లేదా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా గుర్తించాలని మూడేళ్లుగా వీరు ఆందోళనలు చేస్తున్నారు. కొత్తగా ఎవరినీ కాంట్రాక్ట్, ఏసీ పద్ధతిలో తీసుకోవడం లేదని అధికారులు చెప్తున్నారు. కానీ ఇటీవల వర్సిటీ అనుబంధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కంప్యూటర్ సెక్షన్ లో ఎలాంటి నోటిఫికేషన్లేకుండానే టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొడుకు ఒకరికి అకడమిక్ కన్సల్టెంట్ గా పోస్టింగ్ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉన్నా పోస్టింగ్ ఇవ్వడం దుమారం రేపుతోంది.
6 నెలలకోసారి జీతాలు..
యూనివర్సిటీల్లో రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ ఫ్యాకల్టీకి యూజీసీ పే స్కేల్ ప్రకారం నెలకు రూ. లక్ష నుంచి రెండున్నర లక్ష వరకూ శాలరీలు వస్తున్నాయి. వీరితో సమానంగా పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు ఉండి పని చేసే కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్స్(ఏసీ)కు యూనివర్సిటీని బట్టి రూ.12 వేల నుంచి రూ.43 వేల వరకు ఫిక్స్డ్ శాలరీలు ఇస్తున్నారు. పార్ట్ టైం లెక్చరర్లకు మాత్రం చెప్పిన పీరియడ్స్ ను బట్టి బిల్లు పెట్టుకుంటే ఆరు నెలలు, ఏడాదికోసారి శాలరీలు ఇస్తున్నారు. పార్ట్ టైం లెక్చరర్లు రెగ్యులర్ ఫ్యాకల్టీతో సమానంగా క్లాసులు చెప్పినా, జీతం రూ. 15 వేలు మించడం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చెప్పే పార్ట్‌టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వీళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే జీతాలు చెల్లిస్తున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
ఏండ్లుగా పని చేసి, రిటైర్ అవుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. రిటైర్ అయిన ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్‌కు రూ.20 లక్షలు ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోతే, వారి కుటుంబాలకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా, ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇవ్వాలి.
– డాక్టర్ ప్రేమయ్య,ఉపాధ్యక్షుడు, ఔటా (కాంట్రాక్ట్)
పర్మినెంట్ చేయాలి
వర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్లకు పర్మినెంట్ ఫ్యాకల్టీతో సమానంగా సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టు లెక్చరర్లను సర్వీసు నిబంధనల ప్రకారంపర్మినెంట్చేయాలి. జాబ్ సెక్యూరిటీ కల్పించడంతో పాటు సర్వీసు ప్రకారం తగిన హోదా కల్పించాలి.
– డాక్టర్ ధర్మతేజ, ఓయూ సీఏపీ అధ్యక్షుడు
నేను, నా బిడ్డ దిక్కులేనోళ్లమయ్యాం
నా భర్త ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశారు. 35 ఏండ్లకే చనిపోయారు. నేను, నా రెండేళ్ల కూతురు దిక్కులేనోళ్లమయ్యాం. మాకు వర్సిటీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. మాకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. నాకు తగిన ఉద్యోగం ఇప్పించాలి. – రాజేశ్వరి (కాంట్రాక్ట్ లెక్చరర్ కె.శ్రీకాంత్ భార్య)
అధికారులు పట్టించుకుంటలే
ఇప్పుడు నాకు 55 ఏండ్లు. రిటైర్మైంట్ ఏజ్‌కు దగ్గరలో ఉన్నా. ఇప్పటికైనా నన్ను కాంట్రాక్ట్ లెక్చరర్ గానో, అకడమిక్ కన్సల్టెంట్ గానో నియమించి నెలానెలా శాలరీ ఫిక్స్చేసి ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. – వెంకటేశ్వర్లు,పార్ట్ టైం లెక్చరర్, దివ్యాంగుడు
కోర్టు తీర్పునూ అమలు చేస్తలే
కాకతీయ యూనివర్సిటీ బాటనీ డిపార్ట్ మెంట్‌లో 1996 నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నా. నా 25 ఏళ్ల సర్వీస్‌లో రెండుసార్లు రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చినా అన్యాయమే జరిగింది. 2009లో అప్పటి ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య కోసం నాకు పోస్ట్ రాకుండా చేశారు. అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన వారిని తీసేయాలని సుప్రీం తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు. మరో రెండేళ్లయితే నేను రిటైర్ అవుతాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ఇవ్వాలని తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. – డాక్టర్ కరుణాకర్, అధ్యక్షుడు, కేయూ కాం ట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్