- ఎల్లారెడ్డి, బాన్సువాడకు మిషన్లు వచ్చినా బింగించని వైనం
- కామారెడ్డి బెడ్లు పెంచే అవకాశం ఉన్నా.. పట్టించుకోని హెల్త్ డిపార్ట్‌మెంట్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కిడ్నీ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో చాలా మందికి వారానికి మూడు రోజులు డయాలసిస్(రక్త శుద్ధి) చేయాల్సిన పరిస్థితి. పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, ఇప్పటికే ఏర్పాటైన సెంటర్లలో బెడ్స్ సంఖ్య పెంచటం లేదు. కొన్ని చోట్ల పరికరాలు సప్లయ్ అయినప్పటికీ బిగించకపోవడం, హాస్పిటళ్లలో సౌలత్‌లు లేక పేషెంట్లు అవస్థ పడుతున్నారు. డయాలసిస్ కోసం హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లేందుకు పేద, మధ్య తరగతి వారిపై ఆర్థిక భారం పడుతోంది. జిల్లా హాస్పిటల్, బాన్సువాడ ఏరియా హాస్పిటల్ ఇప్పటికే డయాలసిస్ సెంటర్లు పని చేస్తుండగా బిచ్కుందలో ఇటీవల ప్రారంభించారు. ఒక్కో చోట ఐదు బెడ్లు మాత్రమే ఉన్నాయి. సెంటర్‌లో ఏర్పాటు చేసే బెడ్స్‌లో 4 నెగెటివ్, 1 పాజిటివ్ వారికి ఉంటుంది. కామారెడ్డిలో 53 మందికి, బాన్సువాడలో 48 మందికి, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో 73 మందికి డయాలిసిస్ జరుగుతోంది. ఆయా చోట్ల వెయిటింగ్‌లో మరో 150 మందికిపైగా ఉన్నారు.
పరిస్థితి ఇదీ..
కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఇక్కడ 3 షిప్టులే కాకుండా కొన్ని సార్లు 4 షిప్టుల్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇంకా 29 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సెంటర్ ఉన్నా ప్రస్తుతం అది క్లోజ్ కావడంతో అక్కడి పేషెంట్లు కూడా జిల్లా హాస్పిటల్‌కు వస్తున్నారు. ఇక్కడ మరో ఐదు బెడ్లు పెంచడానికి అవకాశం ఉంది. రూమ్స్ ప్రాబ్లమ్‌తో పెంచడం లేదు. బాన్సువాడలో ప్రస్తుతం 5 మిషన్లు ఉండగా ఇక్కడకు మరో 2 మిషన్లు ఇటీవల వచ్చాయి. ఇంకా బిగించాల్సి ఉంది. ఉన్నతాధికారులు తగిన చొరవ చూపితే సమస్య పరిష్కారం కానుంది. ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 5 మిషన్లు 6 నెలల క్రితమే వచ్చాయి. వీటిని బిగించే విషయం లో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ మిషన్ల ఏర్పాటులో డిలే జరుగుతుండడంతో చుట్టూ పక్కల మండలాలకు చెందిన పేషెంట్లు కామారెడ్డి, బాన్సువాడతో పాటు నిజామాబాద్‌కు వెళ్తున్నారు. పైఅంతస్థులో ఏర్పాటు చేయాలా..? కింది వార్డులో ఏర్పాటు చేయాలా..? అనే విషయంలో డిలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి డయాలిసిస్ సేవలను పెంచితే పేషెంట్ల కష్టాలు తగ్గుతాయి.
ఈ ఫొటోఉన్న వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాపర్తి బౌమిక్. ఇతను కొంత కాలంగా కిడ్నీల ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. స్థానిక జిల్లా హాస్పిటల్‌లో డయాలసిస్ చేసుకునేందుకు ఈయన పేరు వెయిటింగ్ లిస్టులో ఉంది. ఇక్కడ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం నిజామాబాద్ హాస్పిటల్‌కు వారానికి 3 రోజులు వెళ్లి డయాలసిస్ చేయించుకుని వస్తున్నారు. షేపెంట్‌తో పాటు మరొకరు వెళ్లాల్సి ఉండడంతో రోజుకు రూ.600కు పైగా ఖర్చవుతోంది. ఒక వారానికి రూ.2 వేల వరకు ఖర్చవుతున్నట్లు బాధిత ఫ్యామిలీ పేర్కొంది. చిన్న పాటి పనులు చేసుకుంటూ జీవించే తమకు ఇటు మందులు, అటు డయాలసిస్ ఖర్చులు భారమవుతున్నాయన్నారు. కామారెడ్డి హాస్పిటల్‌లో డయాలసిస్ ట్రీట్‌మెంట్ ఉంటే ఖర్చులు మిగులుతాయంటున్నారు. బౌమిక్ ఒక్కరే కాదు.. కామారెడ్డి జిల్లాలోని కిడ్నీ పేషేంట్ల అందరి పరిస్థితి ఇదే...