- భద్రాద్రికొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో ఓటర్ల అవస్థలు
- పోలింగ్ కేంద్రంలోనూ కనీస సౌకర్యాలు కరువు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఓటేయాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యధికంగా పోలింగ్ అయ్యేలా ఎన్నికల సంఘం ఓ వైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోటైనా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది.
మారుమూల ప్రాంతాలే ఎక్కువ..
జిల్లాలో అత్యధికం ఏజెన్సీ ప్రాంతం. ఇందులో ఎక్కువగా మారుమూల అటవీ ప్రాంతాలే. గుంపులు గుంపులుగా, గూడాలుగా మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కొన్ని హ్యాబిటేషన్స్కు కలిపి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లకు దూరాభారం తప్పడం లేదు.
- ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు గ్రామపంచాయతీలో ఏడు గ్రామాలున్నాయి. దాదాపు 670 మంది ఓటర్లున్నారు. వీరంతా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని రాజీవ్ నగర్ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడ్తున్న వారు, దివ్యాంగులు అంత దూరం వెళ్లేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గుండాలపాడు గ్రామపంచాయతీ ఆఫీస్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే సగానికి పైగా దూరం తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు.
- ముల్కలపల్లి మండలంలోని రెడ్డిపల్లి, మంగళగుట్ట, సుందర్నగర్ గ్రామాల్లో దాదాపు 788 మంది ఓటర్లున్నారు. వీరంతా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- అశ్వారావుపేట మండలం మొద్దులమాడ గ్రామపంచాయతీలోని పెద్దమిద్దె గ్రామంలో 70గొత్తికోయల ఓట్లున్నాయి. వీరంతా ఏడు కిలోమీటర్ల దూరంలో గల దురదపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి కాలినడకన వెళ్లి ఓటు వేయాల్సిందే. సరైన రోడ్డు మార్గం లేదు. వర్షం వస్తే వాగులను దాటుకుంటూ వెళ్లాల్సిందే.
- గంగారం గ్రామంలో దాదాపు 270ఓటర్లు ఉన్నారు. వీరంతా నాలుగు కిలోమీటర్ల దూరం నడక సాగించి వాగొడ్డు గూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రావాలి.
- వేదాంతపురంలో దాదాపు 330 మంది ఓటర్లున్నారు. వీరు కూడా వాగొడ్డు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాల్సిందే.
- అన్నపురెడ్డిపల్లి మండలంలోని మహబూబ్నగర్ పోలింగ్ స్టేషన్లో టాయ్లెట్ సౌకర్యం లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.
- చండ్రుగొండ మండలం సామ్యాతండా పోలింగ్ కేంద్రంలో టాయ్లెట్, తాగునీటి సౌకర్యాలు లేవు. తండాలో దాదాపు 140 మంది ఓటర్లున్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లోని టాయిలెట్ వాడుకునేలా సర్పంచ్ ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం.
- గుండాల మండలంలోని కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు చెందిన ఓటర్లు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ముత్తాపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి.
- వెంకటాపురం, మల్లెల గుంపు గ్రామాలకు చెందిన ఓటర్లు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి ఓటు వేయాల్సి ఉంది.
- గలభ గ్రామానికి చెందిన ఓటర్లు ఏడు కిలోమీటర్ల దూరంలో గల గుండాలకు వచ్చి ఓటు వేయాల్సి ఉంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి ఓటు వేయాల్సి వస్తోందని ఓటర్లు వాపోతున్నారు.