- మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం
- అధికారుల వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నాడని యూనియన్ల ఆరోపణ
- సంఘాలు లేకనే అధికారులు వేధిస్తున్నారు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలె
- సంఘాల లీడర్ల డిమాండ్
తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సూసైడ్‌కు ఆర్టీసీ అధికారులు వేధింపులే కారణమని యూనియన్ల లీడర్లు ఆరోపిస్తున్నారు. మృతిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్ రెడ్డి (55) తొర్రూరు టీచర్స్‌కాలనీలో ఉంటూ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని లీవ్ తీసుకున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు తిరిగి డ్యూటీలో జాయిన్అయి సెక్యూరిటీ ఆఫీసు రిజిస్ర్టర్లో సంతకం పెట్టి డిపోలోకి వెళ్లాడని డీఎం పరిమిళ తెలిపారు. ఎంత సేపయినా తిరిగి రాకపోవడంతో సెక్యూరటీ సిబ్బంది వెళ్లి చూడగా ఆర్టీసీ డిపో ఆవరణలో పార్క్ చేసిన బస్సులో టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడన్నారు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు.
ఎంక్వైరీ చేయించాలే..
కండక్టర్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ఆరోపించారు. మహేందర్‌రెడ్డి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ లో యూనియన్లు లేకపోవడంతో కార్మికులను అధికారులు వేధిస్తున్నారని, పని ఒత్తిడితో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, ప్రెసిడెంట్ తిరుపతి డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రెటరీ వీఎస్ రావు, ఎన్ఎంయూ అధ్యక్షుడు కమాల్ రెడ్డి కోరారు.