టికెట్లు ఇస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన కండక్టర్​

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో  వరంగల్-–-1 డిపోలో కండక్టర్​గా పనిచేస్తున్న ఎన్. రవీందర్(50) మంగళవారం గుండెపోటు రావడంతో బస్సులోనే చనిపోయాడు. హనుమకొండ నుంచి  అక్కన్నపేటకు ప్రతీ రోజు బస్ సర్వీసు నడుస్తోంది. ఇందులో హసన్ పర్తి  మండలం ఎల్లాపూర్ కు చెందిన కండక్టర్ రవీందర్ రెగ్యులర్ గా డ్యూటీ చేస్తాడు.  సాయంత్రం ఐదు గంటలకు బస్సు అక్కన్నపేటకు చేరుకుంది. అక్కడ ప్రయాణికులను దించి 5.30 గంటలకు హనుమకొండకు బస్సు బయలుదేరింది. రవీందర్ టికెట్లు ఇస్తున్నాడు.  

బస్సు కిలోమీటరు దూరంలోని గొల్లకుంట దగ్గరలోకి చేరగానే రవీందర్ తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్తూనే కుప్పకూలాడు. వెంటనే ఆయనను డ్రైవర్ తోపాటు ప్రయాణికులు కిందకు దించారు. 108 ద్వారా హుస్నాబాద్ లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు.