- అన్ని రాష్ట్రాలు, మినిస్ట్రీల పాలసీలు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయిమెంట్ పాలసీ తేవాలి
- గ్రామాల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటర్నషిప్‌లు..
- విదేశాల్లోనూ ఉపాధి కల్పించేందుకు ఇంటర్నేషనల్ మొబిలిటీ అథారిటీ ఏర్పాటు
- కేంద్రానికి సీఐఐ సూచనలు
న్యూఢిల్లీ: దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) మరింత పెరగాలంటే యువతను సరిగ్గా వాడుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కేంద్రానికి సలహా ఇచ్చింది. పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొంది. రానున్న బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు పెద్ద పీట వేయాలని చెబుతూ, కొన్ని సూచనలు చేసింది. ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ తీసుకురావాలని, లేబర్స్ ఎక్కువగా అవసరముండే సెక్టార్లకు సపోర్ట్‌గా నిలవాలని సిఫార్సు చేసింది. ఇండియాలో యువత సగటు వయసు 29 ఏళ్లుగా ఉంది. 2050 నాటికి మరో 13.3 కోట్ల మంది జాబ్ మార్కెట్‌లోకి వస్తారని అంచనా.
సీఐఐ సలహాలు..
సీఐఐ తన బడ్జెట్ రికమండేషన్స్ రిపోర్ట్‌లో కొన్ని పాయింట్లను ప్రస్తావించింది.
1 కాలేజీల్లో చదువు పూర్తి చేసిన యువతకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటర్నషిప్ అందివ్వాలి. దీంతో షార్ట్ టెర్మ్‌లో ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతాయి. అలానే యువత కాలేజిల్లో నేర్చుకున్న దానికి, ప్రొఫెషనల్ స్కిల్స్ మధ్య అంతరం తగ్గుతుంది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను సరిగ్గా వాడుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కీమ్‌లను ఈజీగా అమలు చేయొచ్చు.
2 ఉద్యోగాలను బిజినెస్‌లు పెంచేలా చేయడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో కొత్త ప్రొవిజన్ తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న 80జేజేఏఏకి బదులుగా చాప్టర్6ఏ డిడక్షన్‌గా కొనసాగించాలి. రెండు ట్యాక్స్ సిస్టమ్స్‌లోనూ ఈ డిడక్షన్స్ అందుబాటులో ఉండాలి.
3 ఉద్యోగాలను పెంచేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అనేక స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఒకతాటిపైకి తెచ్చి ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీని తయారు చేయాలి. ఆన్‌లైన్‌లో ఉద్యోగాల వివరాలు అందుబాటులో ఉండేందుకు నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌ను తీసుకురావాలి. ఉద్యోగాలకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, మినిస్ట్రీల నుంచి డేటాను సేకరించి, ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి.
4 పనిచేస్తున్న వారిలో మహిళల వాటా చాలా తక్కువగా ఉంది. దీనిని పెంచాలి. మహిళలు కూడా పనిచేయడం పెరిగితే ఎకానమీ మరింత వృద్ధి సాధిస్తుంది. వర్క్ ప్లేస్‌లలో మహిళల కోసం డార్మిటరీలను ఏర్పాటు చేయడం వంటి కొత్త చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం కంపెనీలు సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను వాడుకునేందుకు అనుమతివ్వాలి. తాత్కాలిక వర్కర్లకు కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందివ్వాలి.
5 చాలా దేశాల్లో పనిచేసేవారు కరువయ్యారు. ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కింద ఇంటర్నేషనల్ మొబిలిటీ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇతర దేశాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకొని, ఇండియా యువత ఆ దేశాల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలి.
6 గ్లోబల్‌గా అందుబాటులో ఉన్న జాబ్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత స్కిల్స్ పెంచడం ముఖ్యం. ఇందుకోసం స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ వివిధ ప్రోగ్రామ్‌లను లాంచ్ చేయాలి. టెక్నికల్ స్కిల్స్‌ను నేర్పించడంతో పాటు కల్చరల్ ట్రెయినింగ్ ఇవ్వాలి. విదేశీ భాషలను నేర్పించాలి.
భారీగా ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఉత్పాద కత కూడా పెరిగేలా ప్రభుత్వం చూసుకోవాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ పెంచుకోవడంపై ఎక్స్‌పర్ట్ కమిటీ సలహాలివ్వాలని, రానున్న బడ్జెట్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు.
సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గించండి
సిమెంట్‌పై వేస్తున్న జీఎస్‌టీని ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని జేకే లక్ష్మీ సిమెంట్ కేంద్రాన్ని కోరుతోంది. సిమెంట్ వినియోగం పెంచేందుకు బడ్జెట్‌లో చర్యలుండాలని పేర్కొంది. జేకే సిమెంట్ బిహార్‌లో రూ.500 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది .