
హనుమకొండ, వెలుగు : పదేండ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సామాజిక న్యాయాన్ని భ్రష్టుపట్టించి అభివృద్ధి రంగాలను నాశనం చేశారని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావేత్తలు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, అవినీతిపై విచారణ జరగాలని, బాధ్యులైన దోపిడీదారులకు శిక్ష పడాలన్నారు. ‘తెలంగాణ గత పాలనలో ఆర్థిక పరిస్థితి.. ప్రస్తుత ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు’ అనే అంశంపై హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రొఫెసర్కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యమకారుల సమావేశాలు నిర్వహించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా నిజాయతీపరులైన వారిని మాత్రమే పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుడు, వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ప్రభుత్వం ఉద్యమ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్లను కానరాకుండా అధికారంలోకి రాగానే అణిచివేశారన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు, మంత్రులు బందిపోట్లుగా మారారని, ప్రజలకు ఏం లేకుండా చేసి, రూ.ఆరేడు లక్షల కోట్ల అప్పులు చేసి అవతల పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏమైందేమైందని మళ్లీ లొల్లి మొదలుపెట్టారన్నారు. ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై 30 రోజులకే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఫోరం ఫర్ బెటర్వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి ప్రజలు, ప్రజా సంఘాల మద్దతు ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్గ్రహించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజానుకూల నిర్ణయాలే తీసుకుందని, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను సేకరించి, ప్రభుత్వానికి రిపోర్ట్రూపంలో అందజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరముందన్నారు.ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంత అనేదానిపై కచ్చితంగా పరిశోధన జరగాలన్నారు. కేసీఆర్పాలిటిక్స్ వల్లే తెలంగాణ ఆలస్యమైందన్నారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, దీనిపై పున:సమీక్ష జరపాలన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ప్రతినిధులు, మేథావులు సోమ రామూర్తి, చింతకింది కుమారస్వామి, సంగులాల్, దాసరి కృష్ణారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ బాబురావు, రైతు నాయకులు బుచ్చిరెడ్డి, సోమిడి శ్రీనివాస్, అంజన్ రావు, బోమ్మినేని పాపిరెడ్డి,, టీచర్లు సుశీల మాట్లాడారు.