కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్

కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్

యూఎన్​ఎఫ్ సీసీసీ సభ్య దేశాల 27వ సమావేశం (కాప్​–27)  నవంబర్​ 6 నుంచి 18 వరకు ఈజిప్టులోని షర్మ్​ – ఎల్​– షేక్​లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా యూఎన్​ఎఫ్​సీసీసీ, కాప్​ సదస్సులు చాలా కీలకం. కాప్​ ఏర్పాటు, దాని ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. 

మానవ అభివృద్ధి చర్యల ద్వారా పర్యావరణంపై ఏర్పడుతున్న ప్రభావాలను నియంత్రించాలన్న లక్ష్యంతో తొలిసారిగా 1972లో యునైటెడ్​ నేషన్స్​ కాన్ఫరెన్స్​ ఆఫ్​ హ్యూమన్​ ఎన్విరాన్​మెంట్​ పేరుతో స్టాక్​హోంలో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో  పర్యావరణ పరిరక్షణ కోసం సభ్యదేశాలన్నీ శాసనాలు, చట్టాల ద్వారా కృషి చేయాలని తీర్మానించారు. భూతాపం ద్వారా సంభవిస్తున్న శీతోష్ణస్థితి మార్పుపై అధ్యయనంపై 1988లో యూఎన్​ఈపీ అండ్​ డబ్ల్యూఎంఓ సంయుక్తంగా ఇంటర్​ గవర్నమెంటల్​ పానల్​ ఆన్​ క్లైమేట్​ ఛేంజ్​(ఐపీసీసీ) అనే ఒక సంస్థను నియమించింది. ఈ సంస్థ మొదటి నివేదిక 1990లో విడుదలైంది. ఇందులో మానవ జనిత కారణాల ద్వారానే ప్రస్తుత భూతాపం, శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తున్నాయని ఐపీసీసీ పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో భూతాపాన్ని, శీతోష్ణస్థితి మార్పును నివారించే  ఒక ఒప్పందం అవసరమని యూఎన్​ఓ గుర్తించి అందుకు అనుగుణంగా పర్యావరణంపై మానవ అభివృద్ధి ప్రభావాలను చర్చించేందుకు 1992 జూన్​ 3 నుంచి 14 మధ్యలో బ్రెజిల్​లోని రియో డి జెనైరోలో యునైటెడ్​ నేషన్స్​ కాన్ఫరెన్స్​ ఆన్​ ఎన్విరాన్​మెంట్​ అండ్​ డెవలప్​మెంట్​ అనే సదస్సును యూఎన్​ఓ నిర్వహించింది. దీన్నే రియో సదస్సు లేదా ధరిత్రి సదస్సు అంటారు. ఈ సదస్సులో ప్రవేశ పెట్టిన ఒప్పందాల్లో యూఎన్​ఎఫ్​సీసీ(యునైటెడ్​ నేషన్స్​ ఫ్రేమ్​ వర్క్​ కన్వెన్షన్​ ఆన్​ క్లైమేట్​ ఛేంజ్​) ప్రధానమైంది. సభ్యదేశాలన్నీ మనిషి, ఇతర జీవులపై ప్రభావాన్ని చూపని స్థాయికి గ్రీన్​ హౌస్​ ఉద్గారాలను విడుదలను తగ్గించాలని పేర్కొన్నారు. యూఎన్​ఎఫ్​సీసీసీపై సంతకాలు చేసిన దేశాలన్నీ 1995 నుంచి ప్రతి ఏటా సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులను కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్​(కాప్​) అంటారు. మొదటి సదస్సు కాప్​–1 బెర్లిన్​ (1995)లో జరిగింది. 1997లో క్యోటో నగరంలో జరిగిన కాప్​–3 సదస్సులో క్యోటో ప్రోటోకాల్​ అనే ఒప్పందాన్ని రూపొందించారు. 

కాప్​–26 

యూఎన్​ఎఫ్​సీసీసీ సభ్యదేశాల 26వ సమావేశం కాప్​–26 స్కాట్​ల్యాండ్​లోని గ్లాస్గో నగరంలో 2021 అక్టోబర్ 31 నుంచి నవంబర్​ 13 మధ్యకాలంలో జరిగింది. ఈ సదస్సును ఇటలీ, యూకే సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో తీసుకున్న నిర్ణయాలకు గ్లాస్గో క్లైమేట్​ ప్యాక్ట్​(జీసీపీ) అని పేరు పెట్టారు.  

జీపీసీ ముఖ్యాంశాలు 

  •  పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2100 నాటికి ఉష్ణోగ్రతల పెరుగదలను 2 డిగ్రీల లోపే పరిమితం చేయాలి. వీలైతే 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలి.
  • 2050 నాటికి నెట్​జీరో ఉద్గారాలను సాధించాలంటే రెండు దశాబ్దాల్లో 45శాతం మేరకు ఉద్గారాలను తగ్గించాలి. 2025 వరకు వేచి చూడకుండా 2022లోనే మరింత బలమైన జాతీయ ప్రణాళికలు, కొత్త లక్ష్యాలను సభ్య దేశాలు ప్రకటించాలి.