- నాలుగేండ్లు పూర్తవడంతో ఎంపీపీలకు అవిశ్వాస గండం
- గతంలోనే అవిశ్వాసానికి ప్రయత్నించిన హుజూరాబాద్ ఎంపీటీసీలు
- గెలిచిన నాలుగేళ్లలో ఏం చేయలేకపోయామని ఆవేదన
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ఎంపీపీలను అవిశ్వాస గండం వెంటాడుతోంది. మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో కొనసాగిన అవిశ్వాస తీర్మానాల పర్వం ఇప్పుడు మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు చేరింది. ఎంపీటీసీలుగా గెలిచి నాలుగేండ్లయినా నిధులు రాకపోవడం, ప్రజలు నిలదీస్తుండడం, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం, ఎంపీపీలు ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం.. వంటి కారణాలతో వివిధ మండలాల్లో ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాలకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ ఎంపీటీసీలే ముందు వరుసలో ఉంటున్నారు.
ఫిబ్రవరిలోనే హుజూరాబాద్ ఎంపీపీపై అవిశ్వాసానికి సిద్ధం కాగా, తాజాగా రెండు రోజుల కింద గంగాధర ఎంపీపీపై మండల ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ అవిశ్వాసాల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది.
ఎంపీటీసీల్లో అసంతృప్తి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీపీల పదవీకాలం నాలుగేండ్లు గడిచాకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ ఫిబ్రవరిలోనే హుజూరాబాద్ ఎంపీపీ ఇరుకుల్ల రాణిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 10 మంది ఎంపీటీసీలు కలెక్టర్ కు లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా సైలంట్ అయ్యారు. ఇటీవల బుధవారం జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయపై అవిశ్వాసం కోసం జిల్లాలోని 12 మంది జడ్పీటీసీలు చొప్పదండిలో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే గంగాధర మండల ఎంపీటీసీ సభ్యులు సమావేశమై ఎంపీపీని మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. త్వరలో కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా స్థానిక ప్రజాప్రతినిధుల వరుస భేటీలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. భవిష్యత్ లో ఇంకెన్ని చోట్ల అవిశ్వాసాలు తెరమీదకు వస్తాయోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.
ఫండ్స్ కోసమే...
తమ పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉండడం, ఎన్నికల కోసం అప్పట్లో పెట్టిన ఖర్చు కూడా రాకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎలాగైనా నిధుల సాధనే ఎజెండాగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గతంలో కొత్తపల్లి మున్సిపాలిటీలో ఇలాగే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సిద్ధం కాగా మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగి ఒక్కో కౌన్సిలర్ కు రూ.15 లక్షల చొప్పున మంజూరుకు హామీ ఇచ్చారు. దీంతో అసమ్మతి సమసిపోయింది. ఇదే పద్ధతిలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఫండ్స్ ఇవ్వకపోతారా, అందులో ఎంతో కొంత దక్కకపోతాయా అన్న ఉద్దేశంతోనే ఎంపీటీసీ సభ్యులంతా ఏకమవుతున్నట్లు తెలుస్తోంది.