స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మేమే తెచ్చాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మేమే తెచ్చాం

మహిళల కోటాపై మండలిలో జీవన్​రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్ ఆలోచించింది.. తాము అమలు చేశామన్న కేటీఆర్

లైబ్రరీ ట్యాక్స్ తీస్కుంటరు.. అభివృద్ధి చేయరా?: రాంచందర్ రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల కోటాపై శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. 50 శాతం రిజర్వేషన్లు తామే తెచ్చామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి చెప్పగా.. కాంగ్రెస్ ఆలోచనే చేసిందని, తాము అమలు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన జీహెచ్‌‌‌‌ఎంసీ, నాలా, స్టాంప్స్‌‌‌‌, సీఆర్పీసీ చట్టాల సవరణ బిల్లులను బుధవారం మండలిలో ప్రవేశపెట్టారు. జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్ట్‌‌‌‌పై చర్చ సందర్భంగా జీవన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. తాము తెచ్చిన రిజర్వేషన్లనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. దానిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ గొప్ప ఆలోచనలు చేసింది గాని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌ జీవోనే ఇచ్చిందని, తాము అమలు చేశామని చెప్పారు. జీవన్​రెడ్డి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం జీవోనే ఇవ్వలేదని.. రిజర్వేషన్లనూ కల్పించిందంటూ పత్రాలు చూపించారు. దీంతో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్​రెడ్డి జోక్యం చేసుకొని అప్పుడు రిజర్వేషన్లు అమలు చేశారు కాబట్టి ఇప్పుడు చట్టం వద్దంటారా చెప్పాలన్నారు.

అహ్మదాబాద్‌‌‌‌ మోడల్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో వద్దు

అంబర్‌‌‌‌పేటలో ఫ్లై ఓవర్‌‌‌‌ నిర్మాణానికి చొరవ చూపాలని, అక్కడ మసీద్‌‌‌‌కు రూ.2 కోట్ల పరిహారం తీసుకొని పనులకు అడ్డు పడుతున్నారని రామచందర్‌‌‌‌రావు సభ దృష్టికి తీసుకువచ్చారు. కేటీఆర్‌‌‌‌ మాట్లాడుతూ.. రోడ్లపై ఉన్న మందిరాల తొలగింపునకు గుజరాత్‌‌‌‌లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకొచ్చారని.. ఎంఐఎం, బీజేపీ ఒప్పుకుంటే ఇక్కడ తీసుకొస్తామని ప్రకటించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ స్పందిస్తూ.. ఆ మోడల్‌‌‌‌ వద్దన్నారు.

సహాయక శిబిరాలు ఏర్పాటు చేశాం: కేటీఆర్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌లో ఇంతటి భారీ వర్షాలు 40 ఏళ్లలో కురవలేదని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. హైదరాబాద్‌‌‌‌లో భారీ వానలతో నిరాశ్రయులైన ప్రజలు, వర్ష బీభత్సంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఆశ్రయం కల్పించడానికి నగరంలో 40 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. 700 మంది డిజాస్టర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ సిబ్బందితో పాటు ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌, జీహెచ్‌‌‌‌ఎంసీ, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. హెలికాప్టర్లు, బోట్లు సిద్ధంగా ఉంచామన్నారు. శిథిలావస్థకు చేరిన బిల్డింగులను ఖాళీ చేయాలని వర్షాకాలానికి ముందే హెచ్చరించామని, అయినా మొండిగా కొందరు ఇండ్లల్లోనే ఉండటంతో ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. ఇక అలాంటి బిల్డింగుల్లోని వాళ్లను బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని ప్రకటించారు. రోడ్లపై ఉండే వారిని నైట్‌‌‌‌ షెల్టర్స్‌‌‌‌కు తరలిస్తున్నామని.. భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

లైబ్రరీలను అభివృద్ధి చేయాలి

బీసీ రిజర్వేషన్ల కోటాలోనే ముస్లిం మైనార్టీలకు 4 శాతం కల్పించడంతో అన్యాయం జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌‌‌‌రావు అన్నారు. భారీ వర్షాలకు నగరంలో మనుషులు చనిపోయే పరిస్థితి తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం లైబ్రరీ ట్యాక్స్‌‌‌‌ వసూలు చేస్తుంది కానీ ఒక్క చోట కూడా లైబ్రరీలను అభివృద్ధి చేయడం లేదన్నారు. వార్డు కమిటీ సభ్యుల నియామకంతో కార్పొరేటర్లకు రాజకీయంగా ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. కేటీఆర్‌‌‌‌ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఏం చేసినా బాజాప్తా చేస్తుందని, బేజాప్తా చేయాల్సిన అవసరం లేదన్నారు. కార్పొరేటర్ల స్థాయి తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.

నాలా కన్వర్షన్‌ లో హిడెన్‌ చార్జీలు

నాలా కన్వర్షన్‌‌‌‌ పేరుతో ప్రజల నుంచి హిడెన్‌‌‌‌ చార్జీలు వసూలు చేయడానికి సర్కారు ప్రయత్నిస్తోందని, దాన్ని ఉపసంహరించుకోవాలని జీవన్‌‌‌‌రెడ్డి డిమాండ్​చేశారు. కాంగ్రెస్‌‌‌‌ హయాంలో 9 % ఉన్న చార్జీని 3 శాతానికి తగ్గించామని టీఆర్​ఎస్ సభ్యులు చెప్పగా.. పాత పద్ధతి ఉండొద్దనే రాష్ట్రం తెచ్చుకున్నామని.. ఆ పద్ధతిలోనే వసూలు చేస్తారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలోనే ప్రజల వివరాలన్నీ సేకరించారని, ఇప్పుడు ధరణి సర్వే పేరుతో మళ్లీ కుటుంబీకుల వివరాలు ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు. పోలీస్‌‌‌‌ స్టేషన్లలో బెయిల్‌‌‌‌ ఇచ్చే 41 సీఆర్పీసీని తొలగించాలని రామచంద్‌ రావు, జీవన్‌‌‌‌రెడ్డి కోరారు. 4 బిల్లులపై చర్చ తర్వాత వాటిని సభ ఆమోదించింది. మహిళల కోటాపై తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు జీవన్‌‌‌‌రెడ్డి తెలిపారు. బిల్లులకు ఆమోదం తర్వాత కౌన్సిల్‌‌‌‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు. బీసీలకు 42 % కోటా ఇవ్వాలి. జీహెచ్​ఎంసీలో ఎస్టీలకు 1.33 %, ఎస్సీలకు 6.66 % రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఇది పోను మిగిలిన 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని జీవన్‌‌‌‌రెడ్డి సూచించారు. 2016 రిజర్వేషన్లనే ఇప్పుడు ఎన్ని కలకు వర్తింపజేస్తామంటే బీసీలకు అన్యాయం చేయడమేనని అన్నారు.

For More News..

విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడంపై హైకోర్టు గుస్సా..

ఎక్కడోళ్లకు అక్కడ్నే పరీక్షలు.. వర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందం

బీ కేర్‌ఫుల్.. పందుల నుంచి మరో కరోనా