- ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదంటూ లీడర్ల అసహనం
- సీనియర్ల పక్కన చేరుతున్న ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం
- కాంగ్రెస్‌లోనూ ఇదే తీరు
నల్గొండ, వెలుగు :ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్లకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల ఇయర్ కావడంతో ఒకరిపై మరొకరు హాట్‌హాట్‌గా కామెంట్లు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతలకు, జూనియర్ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరిగిపోయింది. ఎమ్మెల్యేల వైఖరి నచ్చని ముఖ్య నేతలు, సీనియర్లు ఏకతాటిపైకి వస్తుండగా... కాంగ్రెస్‌లో సీనియర్ల పేరు చెబితేనే జూనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు ఒక రకంగా, తర్వాత మరోరకంగా వ్యవహరిస్తున్న వారి తీరును చూసి సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ మేలు కోరి సైలెంట్‌గా ఉన్న వారంతా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓపెన్‌గానే కామెంట్లు చేస్తుండడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలపైన చేసిన కామెంట్లకు మద్దతుగా శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఎమ్మెల్యేల తీరు మారకపోతే అంతే..
2018 ఎన్నికల్లో సీనియర్ల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యేలు తర్వాత ప్లేట్ ఫిరాయించారు. సీనియర్ల పట్ల గౌరవ, మర్యాదలు పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే వైఖరి ప్రదర్శిస్తే ఎన్నికల్లో ప్రజాగ్రహం తప్పదని గుత్తా వంటి సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించడం, ప్రజా సమస్యల గురించి పట్టించుకోకపోవడం, లీడర్ల పట్ల లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని అన్నారు. 2018 ఎన్నికల్లో నకిరేకల్, మునుగోడులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి అవే కారణాలని చెప్పుకొచ్చారు. టీడీపీలో తనకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైందని చెప్పిన ఆయన, ఎమ్మెల్యేల తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని సంకేతాలు ఇచ్చారు.
సీనియర్లతో విభేదాలు
2018 ఎన్నికల్లో సీనియర్ల మద్ధతుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత వాళ్ల గురించి పట్టించుకోవడమే మానేశారు. ముఖ్యంగా నల్గొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అనుచరులు, గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య గ్యాప్ పెరిగింది. దేవరకొండలో గుత్తా ప్రధాన అనుచరుడు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహను పదవి నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే వర్గం తీవ్రంగానే ప్రయత్నించింది. ఒప్పందం మేరకు వైస్ చైర్మన్‌ను చైర్మన్ చేయాలని హైకమాండ్ స్థాయిలో గట్టి ప్రయత్నాలే జరిగాయి. నల్గొండలో గుత్తా ప్రధాన అనుచరుడు, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డిని ఎమ్మెల్యే వర్గం పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వపరంగా జరిగే ప్రోగ్రాంలకు సంబంధించి సుఖేందర్‌రెడ్డికి ఆహ్వానం కూడా అందడం లేదు. ఎమ్మెల్యే పోకడ నచ్చని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గుత్తా గూటికి చేరారు. దీంతో నల్గొండలో గుత్తా వర్సెస్ కంచర్ల అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ను కాదని వచ్చిన కాంగ్రెస్ సీనియర్లకు బీఆర్‌ఎస్‌లో సరైన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో మళ్లీ సొంత గూటికి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోదాడలో మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్గీయుల మద్య విభేదాలు పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భగత్ మధ్య సఖ్యత కుదరట్లేదు. మార్కెట్ కమిటీ పదవులు, నిధుల పంపకాల్లో తేడాలు రావడంతో నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్‌లో జూనియర్లు సైలెంట్
కాంగ్రెస్‌లో జూనియర్ లీడర్లు సీనియర్ల వైఖరిపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లు సీనియర్లనే నమ్ముకుని రాజకీయం నడిపిస్తున్న వారంతా మునుగోడు ఎన్నికలప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నల్గొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో జూనియర్ లీడర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాక మునుగోడులో కాంగ్రెస్ కేడర్ గందరగోళంలో పడింది. ఈ ఎఫెక్ట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత నియోజకవర్గం నల్గొండపై కనిపించింది. రాజకీయంగా వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో అర్థంగాక నల్గొండలో ఆయన వర్గీయులు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు టీఆర్‌ఎస్ లీడర్లతో కలుస్తున్నారు. నకిరేకల్‌లో చెరుకు సుధాకర్ పార్టీలో చేరడంతో అక్కడ కూడా వెంకట్‌రెడ్డి కేడర్ సైలెంట్ అయింది. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు వ్యతిరేకంగా కొత్త టీమ్ తెర పైకి వచ్చింది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ ఇటీవల సీనియర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్‌డ్ సీట్లలో సీనియర్ల జోక్యం ఏంటని ప్రశ్నించారు.
సూర్యాపేటలో దామోదర్‌రెడ్డి వర్సెస్ రమేశ్‌రెడ్డి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కాంగ్రెస్‌లో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య టికెట్ వార్ నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ ఇద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల టైంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రమేశ్‌రెడ్డికి చివరి నిమిషంలో టికెట్ చేజారింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యఅనుచరుడైన ఆయన ప్రస్తుతం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో సూర్యాపేట నియోజకవర్గంలో పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ నెల 18న సూర్యాపేట మండలంలోని సోలిపేట నుంచి ప్రారంభమైన యాత్ర రెండు రోజులకే నిలిచిపోయింది. 26 నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఉండడం వల్లే రమేశ్‌రెడ్డి యాత్ర తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన వర్గం లీడర్లు చెబుతున్నారు. కానీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం వల్లే రమేశ్‌రెడ్డి యాత్రకు బ్రేక్ పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.