సిలబస్​ తగ్గింపుపై అయోమయం!

ఇప్పటికే ఆన్​లైన్​లో రెండు చాప్టర్లు పూర్తి

కుదించినదాంట్లో ఈ చాప్టర్ల పై నో క్లారిటీ

విద్యాశాఖ డైరెక్టర్​ సిలబస్​ ప్రకటనపై గందరగోళం

ఆదిలాబాద్, వెలుగు: ఈ విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్ మాత్రమే పరీక్షల్లో వస్తుందంటూ విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన చేసిన ప్రకటనతో టీచర్లు, స్టూడెంట్లలో గందరగోళం నెలకొంది. ఏయే చాప్టర్లు తొలగించారు.. 70 శాతం సిలబస్​పై స్పష్టతో ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. డైరెక్టర్​ విడుదల చేసిన ప్రకటనలో పదో తరగతి గణితం సబ్జెక్ట్​లో ఇదివరకే ఆన్​లైన్​లో పూర్తయిన మొదటి రెండు చాప్టర్లు వాస్తవ సంఖ్యలు, సమితులు లేవు. సిలబస్​ మూడో చాప్టర్​  బహుపదులు నుంచి మొదలైంది. అక్కడి నుంచి మిగతా చాప్టర్లన్నీ ఉన్నాయి. మొదటి రెండు చాప్టర్లు లేకపోవడం.. ఆ చాప్టర్లు పరీక్షల్లో వస్తాయా.. లేదా.. ఎక్కడా స్పష్టత లేదు. మిగతా తరగతుల సిలబస్​సైతం ఇదే విధంగా అర్థం కాకుండా ఉన్నాయి.  ఈ విద్యా సంవత్సరంలో కృత్యాలు, ప్రాజెక్టుల ద్వారా నేర్చుకున్న భావనలు, అధ్యాయాలు సంవత్సరాంత బోర్డు పరీక్షల్లో భాగం కాదు అని ఉంది. స్టూడెంట్లు ప్రతి అంశాన్ని కృత్యాలు, ప్రాజెక్టుల ద్వారానే నేర్చుకోవాలనేది రూల్. ఈ రూల్​ప్రకారం నేర్చుకున్న అంశాలు చివరాఖరి బోర్డు పరీక్షల్లో భాగం కాదని ఉండడం టీచర్లందరినీ అయోమయానికి గురిచేస్తోంది.

కరువైన క్లారిటీ

ప్రకటించిన సిలబస్​పట్టికలో పదో తరగతి గణిత భాగం చూస్తే మొదటి రెండు పాఠాలు తప్ప మొత్తం చాప్టర్లు ఉన్నాయి. డైరెక్టర్​ఆఫ్​స్కూల్​ఎడ్యుకేషన్(డీఎస్ఈ) చేసిన ప్రకటన ప్రకారం.. కృత్యాలు, ప్రాజెక్టుల ద్వారా నేర్చుకున్న భావనలు, అధ్యాయాలు సంవత్సరాంత బోర్డు పరీక్షల్లో భాగం కాదు అనుకుంటే తాజా పదో తరగతి గణితం సిలబస్​లో కేవలం మొదటి రెండు పాఠాలకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే మొదటి రెండు చాప్టర్లు తప్ప మిగతావన్నీ పరీక్షల్లో వస్తాయా.. అనే అంశంలో స్పష్టత లేదు. అన్ని తరగతుల సబ్జెక్టుల్లో ఇదే విధమైన గందరగోళం కనిపిస్తోంది. తాజా ప్రకటనలో విషయాల వారీగా ప్రకటించిన పట్టికలపై 30 శాతం అని రాసి ఉంది. అంటే, ప్రకటించిన చాప్టర్లన్నీ 30 శాతం కిందికి వస్తాయా.. అలా వస్తే దానికి వాడిన శాస్త్రీయ విధానాలు ఏమిటనే అంశాలు తెలియజేయలేదు. ఇప్పటికే ఆన్​లైన్​ క్లాసులు పూర్తయిన అన్ని సబ్జెక్టుల మొదటి రెండు చాప్టర్లు విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వర్క్​షీట్​లలో ఉన్నాయి. అంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినవి సిలబస్​లో ఉన్నాయా.. లేదా అన్నది టీచర్లకు సైతం అర్థం కావడం లేదు. ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు.

సిలబస్​లో స్పష్టత లేదు

తాజాగా స్కూల్​ఎడ్యుకేషన్ ​డైరెక్టర్ నుంచి వెలువడిన సిలబస్ ప్రకటనలో స్పష్టత లేదు. నేను ఎస్సీఈఆర్టీ టీచర్​ను కావడంతో నాకు చాలామంది టీచర్లు ఫోన్ చేసి తెలుగుపై స్పష్టత అడుగుతున్నారు. ప్రకటించిన సిలబస్​లో స్పష్టత కన్పించకపోవడంతో నేను కూడా ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
– ధర్మేంద్రసింగ్, ఎస్సీఆర్టీ టీచర్

అర్థమయ్యేలా వివరిస్తాం

తాజాగా వెలువడ్డ సిలబస్ లో కొన్ని అర్థంకాని విషయాలున్నాయంటూ చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. వాటన్నింటినీ  సంబంధిత టీచర్లకు అర్థమయ్యేలా వివరిస్తాం. ముందుగా ఏ పాఠ్యాంశాలు పరీక్షల్లో వస్తాయి, ఏవి రావనే దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ తీసుకుంటాం.

–రవీందర్​రెడి, డీఈవో, ఆదిలాబాద్

For More News..

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800

అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో క్రికెట్‌‌ లైవ్‌‌