జాతర భారమంతా ఆఫీసర్లపైనే.. ఐనవోలు ట్రస్ట్‌‌‌‌ బోర్డుపై గందరగోళం

  •     కమిటీ ఏర్పాటుపై కానరాని స్పష్టత
  •     కొత్తకొండలోనూ ముగిసిన పాలకవర్గ పదవీకాలం
  •     బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనా కొత్త కమిటీపై నో క్లారిటీ

హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లాలోని పలు ఆలయాలకు ట్రస్ట్‌‌‌‌ బోర్డుల ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఏర్పాటు చేసిన పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసిపోయింది. అయినా కొత్త కమిటీల నియామకంపై క్లారిటీ రావడం లేదు. జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంతో పాటు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తకొండ వీరభద్రస్వామి కల్యాణోత్సవం ముగిసినా ఆలయ కమిటీ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

కమిటీ లేకుండానే ఐలోని మల్లన్న ఉత్సవాలు

ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ ఆలయ ట్రస్ట్‌‌‌‌ బోర్డుపై ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయింది. గతేడాది జాతరకు మూడు రోజుల ముందు అప్పటి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌ సూచన మేరకు హడావుడిగా ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ట్రస్ట్‌‌‌‌ బోర్డు ఏర్పాటులో రూల్స్‌‌‌‌ పాటించలేదంటూ, ఆలయంలో వాటాదారులుగా ఉన్న వారికి కమిటీలో సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదన్న రూల్‌‌‌‌ను పట్టించుకోకుండా కమిటీని ఏర్పాటు చేశారని శ్రీనివాసులు అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు.

దీంతో ట్రస్ట్‌‌‌‌ బోర్డు నియామకం చెల్లదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత అక్టోబర్‌‌‌‌ నెలలో వివాదం వీగిపోయిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. గత కమిటీనే కొనసాగుతుందని కొంతమంది స్థానికంగానూ ప్రచారం చేస్తున్నారు. కానీ గత ట్రస్ట్​బోర్డు నియామకానికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఎండోమెంట్‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌‌‌‌ నేత కేఆర్​నాగరాజు గెలుపొందగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీకి ప్రాధాన్యం ఉండదని ప్రచారం జరుగుతుండగా కొత్త కమిటీకి నోటిఫికేషన్‌‌‌‌ కూడా కాలేదు. దీంతో ఈ సారి ఆలయ కమిటీ లేకుండానే మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఉత్సవాలు ప్రారంభమైనా కనిపించని కమిటీ

హుస్నాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి సన్నిధిలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇది వరకు ఉన్న పాలకవర్గ గడువు గత అక్టోబర్‌‌‌‌లోనే ముగిసింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్​అమల్లోకి రావడంతో పాలకవర్గాన్ని కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారం కోల్పోవడంతో పాత కమిటీకి మళ్లీ అవకాశమే లేకుండా పోయింది.

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ట్రస్ట్​బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌‌‌‌ జారీ కాలేదు. దీంతో ఆలయ కమిటీ లేకుండానే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 10న స్వామి, అమ్మవారి కల్యాణం సైతం నిర్వహించారు. ఉత్సవాలు 18వ తేదీ వరకు జరగనుండగా ఆ తర్వాతే కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌‌‌‌తో పాటు సభ్యులుగా అవకాశం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆఫీసర్లపైనే భారం

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా ఐలోని మల్లన్న ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శనివారం ధ్వజారోహనంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత 14న భోగి, 15న సంక్రాంతి, 16 కనుమ సందర్భంగా నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉంది. ఆలయ కమిటీ ఇప్పటివరకు స్పష్టత లేకపోడవంతో ఈ సారి కూడా భారమంతా ఆఫీసర్లపైనే పడనుంది.

జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రివ్యూ నిర్వహించగా, జాతర స్పెషల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా హనుమకొండ ఆర్డీవో రమేశ్‌‌‌‌ను నియమించారు. ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో శానిటేషన్ ప్రధాన సమస్య కాగా జీడబ్ల్యూఎంసీ నుంచి అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు కూడా జాతరను సక్సెస్‌‌‌‌ చేయడంపై ఫోకస్‌‌‌‌ పెట్టారు.

ఇక కొత్తకొండలో 14 నుంచి 18వ తేదీ వరకు జాతర జరగనుండగా.. ఈవో కిషన్‌‌‌‌ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు

హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు : జానపదుల జాతరైన ఐలోని మల్లన్న ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా ఉదయం స్వామి వారికి నూతన వస్త్రాలంకరణం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదనం నిర్వహించనున్నారు.