సూర్యాపేట మార్కెట్ లో గందరగోళం

  • వడ్లు లిఫ్ట్​ కావట్లేదని మార్కెట్​కు సెలవు 
  • ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆందోళన

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో గురువారం గందరగోళం నెలకొంది. రోజుకు 50 వేల బస్తాల వడ్లు మార్కెట్ కు వస్తుండడంతో ట్రాన్స్​పోర్ట్​ ఆలస్యమవుతోంది. వీటికి తోడు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి 50 వేల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఇదిలాఉంటే గురువారం ధాన్యం లిఫ్ట్  కాకపోవడంతో మార్కెట్  అధికారులు సెలవు ప్రకటించారు. అయితే అప్పటికే టోకెన్లు అందించడం, మరోవైపు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవు ప్రకటించడంతో మార్కెట్ కు 300 ట్రాక్టర్లలో రైతులు వడ్లు తీసుకొచ్చారు. వారిని మార్కెట్ లోకి రానివ్వకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

తడిసిన వడ్లను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్  చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్కెట్ కు సెలవు ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. వర్షం వస్తే నష్టపోతామంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లను అనుమతిస్తామని, శుక్రవారం యథావిధిగా కొనుగోళ్లు చేస్తామని అధికారులు సర్ది చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన

లోకేశ్వరం: వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్  గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేశారు. గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోని నిర్మల్– బైంసా రహదారిపై ఆందోళనకు దిగగా, వందలాది వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 40 రోజులు గడిచినా, వడ్లు తూకం వేయడం లేదని వాపోయారు.

6 లారీల వడ్లను మిల్లుకు పంపినా తాలు, తప్ప పేరుతో దింపుకోవడం లేదన్నారు. కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గ్రామ రైతులు బుధవారం సర్వేను బహిష్కరించారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు.