సర్కార్​ చేతగానితనం వల్లే గందరగోళం: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

సర్కార్​ చేతగానితనం వల్లే గందరగోళం: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్
  • టీజేఎస్ ​చీఫ్​ కోదండరాం, బీఎస్పీ స్టేట్ చీఫ్ ​ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ ​ఫైర్​
  • హౌస్​ అరెస్ట్ చేయడంతో ఇండ్లలోనే నేతల దీక్ష
  • ఇన్నేండ్లు మౌనంగా ఉండి ఒక్కసారే అన్ని పరీక్షలు పెడ్తమంటే ఎట్ల: కోదండరాం
  • కల్వకుంట్ల ఫ్యామిలీ జాబ్స్ అమ్ముకున్నది: ప్రవీణ్​ కుమార్ 
  • టీచర్ ​పరీక్ష రాసేవాళ్లు గ్రూప్స్ రాయకుండా కేసీఆర్ కుట్ర

హైదరాబాద్/సికింద్రాబాద్/ ముషీరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే గ్రూప్ 2 ​పరీక్షల నిర్వహణలో గందరగోళం ఏర్పడిందని టీజేఎస్ ​చీఫ్​ కోదండరాం, బీఎస్పీ స్టేట్ చీఫ్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ మండిపడ్డారు. లక్షల మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు పట్టించుకోకపోవడం ఏంటని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారంగా పరీక్షలు జరిపితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. గ్రూపు–2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం గన్ పార్క్ వద్ద దీక్ష చేపడతామని కోదం డరామ్, ప్రవీణ్​కుమార్ శుక్రవారం ప్రకటించారు. దీంతో శనివారం తెల్లవారుజామునే పోలీసులు వీరిని హౌస్​ అరెస్టు చేయడంతో ఎవరి ఇండ్లలో వారు దీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వేరువేరుగా మీడియాతో మాట్లాడారు.

సర్కార్​ తప్పుకు అభ్యర్థుల్ని బాధ్యులు చేస్తరా

రాష్ట్రం ప్రభుత్వం ఇన్నేండ్లు మౌనంగా ఉండి ఇప్పుడు అన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తామంటే ఎలా అని కోదండరాం ప్రశ్నించారు. ‘‘టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా పెడ్తున్నరు. వేరు వేరు పరీక్షలకు వేరువేరుగా చదవాల్సి ఉంటుంది. పరీక్షలు రాయడం కష్టంగా ఉంటుందని, వాయిదా వేయాలని అభ్యర్థులు పదేపదే కోరతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరం” అని అన్నారు. నిరుద్యోగుల పట్ల సర్కార్ అనాలోచితంగా వ్యవహరించ వద్దన్నారు. మీ తప్పిదాలకు స్టూడెండ్లను బాధ్యులను చేయడం సరికాదని మండిపడ్డారు. ‘‘ఇది ప్రభుత్వం తప్పు, అందువల్ల ప్రభుత్వమే బాధ్యత వహించాలె” అని అన్నారు.   కోదండరాంతో పాటు దీక్షలో  ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, పల్లె వినయ్, ధర సత్యం, మాసంపల్లి అరుణ్ కుమార్, కొత్త రవి, పుష్పా లత తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులు రద్దు చేయాలి

రాజ్​భవన్​ ముట్టడికి ఆర్టీసీ ఉద్యోగులను పంపినోళ్లు.. ఇప్పుడు ఇతరులు ధర్నా చేస్తే ఎలా అరెస్టు చేస్తున్నారని ప్రవీణ్ ​కుమార్ ప్రశ్నించారు. ‘మీకో న్యాయం మాకో న్యాయమా’ అని నిలదీశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. టీఎస్​పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయాలని అన్నందుకు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ ఉచితంగా కోచింగ్, మెటీరియల్, ఆహారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఏ ట్విట్టర్ ఆఫీసులో కూర్చున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యలపై కేసీఆర్​ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని.. స్టూడెంట్లపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలన్నారు.

పేపరల్ లీక్ కేసులో వివరాలు చెప్పట్లేదు 

టీఎస్​పీఎస్సీ ద్వారా రిక్రూట్​కావాల్సిన ఉద్యోగాలను కల్వకుంట్ల కుటుంబం ముందే అమ్ముకుందని  ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అందుకే మార్చిలో జరిగిన పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా గ్రూప్ 2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందే పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు చెప్పారని విమర్శించారు. టీఎస్​పీఎస్సీలో కేసీఆర్ ఏజెంట్లు ఉన్నారని.. అందుకే కమిషన్​పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసే వారు, గ్రూప్స్​ రాయొద్దనికుట్ర చేస్తున్నారని ఆరోపించారు.