సీఎం ఎన్నికకు ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకులు కూడా భవిష్యత్తులో తమ కార్యకలాపాలను ప్రజల మనోభావాలకు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మరోవైపు బీఆర్ఎస్, దాని అధినాయకత్వంపై ప్రజల్లో ఇసుమంతైన సానుభూతి కనపడకపోగా ఈసడింపులు ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకొలువుదీరగానే విచిత్రంగా కేసీఆర్ ఫాంహౌస్‌లో జారిపడటంతో గాయపడ్డారని తెలుస్తున్నది. కేసీఆర్ తన పాలనలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు అమలులో లోపాలను లోతుగా విశ్లేషించుకోవలసిన అవసరం కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ తీరు అభ్యంతరకరం
కవితపై ఈడీ, ఐటీ దాడులు జరిగినప్పుడు, ఢిల్లీలో విచారణ జరిగిన్పప్పుడు కూడా ఆమెపై ఇసుమంత కూడా సానుభూతిని ప్రజలు తెలపకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేసి పార్టీ నుంచి కేసీఆర్ బహిష్కరించినప్పుడు చాలామంది మేధావులకు అనేక సందేహాలు కలిగాయి. తెలంగాణ అంతటా ఈటల పై సానుభూతి వ్యాఖ్యలు వినిపించాయి.
హుజురాబాద్ బై ఎలక్షన్లలో అధికార బీఆర్ఎస్ ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసినా సర్వశక్తులను మోహరించినా సానుభూతే ఈటల గెలుపునకు కారణమైంది. ఆ సమయంలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెరమీదకి తీసుకువచ్చినా పెద్దగా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయారు. అదేవిధంగా రైతుబంధు పథకం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయకపోగా గుదిబండలా మారి కేసీఆర్‌కు కావాల్సినంత కీడును చేసింది. అంతేగాక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటిపై పోలీసుల దాడి, రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు ఆయనను తీసుకుపోయిన తీరు యాదిలోకి వచ్చి కేసీఆర్నుకలవర పెట్టాయేమో అనిపిస్తుంది. అధికార పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు, వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.
కొంపముంచిన కుటుంబ పాలన
కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే విజ్ఞుడైన ఒక నాయకుడు లెక్కలు వేసి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని, తాము మళ్లీ అధికారంలోకి తిరిగి వస్తామని పలకడాన్ని చూస్తే ఆయన బుద్ధి సభ్య సమాజానికి తెలియ వచ్చింది. పైగా ఆ పార్టీ అధినాయకులు పలికే అసహన వ్యాఖ్యలు చూస్తే వారిపట్ల జాలి కలుగకపోగా మరింత ఏహ్య భావాన్ని కలిగిస్తున్నది. బీఆర్ఎస్ అధినాయకుడి పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల పట్ల ప్రజల భావాలను సామాజిక తెలంగాణ ఊహించుకోలేకపోతున్నది. గతంలో తాము దాదాపు పది సంవత్సరాలు పరిపాలించిన తీరు, ఆ పార్టీ ముఖ్య నాయకుల ప్రవర్తనపై చూపిన ప్రతికూల పరిస్థితులు తమ ఓటమికి కారణమయ్యాయనే విషయాన్ని వారు గ్రహించడం లేదు.
ఇది ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు. మొన్నటివరకు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ తమను తాము సమీక్షించుకోవాలి. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విమర్శలకు దిగడం తీవ్ర ఆక్షేపణీయం. ఇది బీఆర్ఎస్ నాయకుల పతనాన్ని, దిగజారుడుతనాన్ని తెలియజేస్తోంది. భవిష్యత్తులో పూడ్చుకోలేని ఏహ్య భావాన్ని ప్రజా సమూహాల్లో బీఆర్ఎస్కలగజేసుకుంటున్నది. ఏతావాతా తేలిందేమంటే కేసీఆర్ అనుసరించిన ద్వంద్వ నీతి ప్రమాణాలు, కుటుంబ పాలన, నైతిక విలువలకు కేసీఆర్
తిలోదకాలివ్వడం అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైందనడంలో ఎటువంటి సందేహం లేదు.
- జూకంటి జగన్నాథం, కవి, రచయిత