వనపర్తి, వెలుగు: అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు అవుతుండడంతో కాంగ్రెస్ పార్టీలోని ఆశావాహులు హైకమాండ్ పేర్లు ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇంతటితో ఆగకుండా టికెట్ తమకే కన్ ఫాం అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రచారాన్ని ఖండించాలని డీసీసీ అధ్యక్షులకు పీసీసీ సూచించింది. దీంతో వనపర్తి, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రచారాన్ని ఆపాలంటూ డీసీసీ అధ్యక్షులు క్యాడర్ ను ఆదేశించారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చిందంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం మొదలైంది.
సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల ముందు పార్టీలోకి వచ్చి పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని డీసీసీ అధ్యక్షుడు ఆ వార్తలను ఖండించారు. మరోపక్క వనపర్తి టికెట్ ఆశిస్తున్న మేఘారెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడికే టికెట్ వస్తుందని ధీమాలో ఉన్నారు. పలు పత్రికల్లో వచ్చిన పేపర్ కటింగ్ లు మాత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని, పనిగట్టుకొని ఎవరూ ప్రచారం చేయలేదని కొట్టి పారేస్తున్నారు.
దేవరకద్రలో పోటాపోటీ..
దేవరకద్రలో మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి(జీఎంఆర్)కి టికెట్ వచ్చిందంటూ ప్రచారం చేయడాన్ని, ఆ పార్టీలోని మరో నేత తప్పు పడుతున్నారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ మిస్ అయిందని, అప్పుడు హైకమాండ్ తనకు స్పష్టమైన హామీనివ్వడంతో ఈ సారి టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు చెప్పారు. బీసీ కోటాలో తనకే టికెట్ వస్తుందని ప్రదీప్ గౌడ్ ధీమాగా ఉన్నారు. జీఎంఆర్, ప్రదీప్ గౌడ్ గ్రూపుల మధ్య ఎవరికి వారే ప్రచారం చేసుకోవడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన డోకూరు పవన్ కుమార్ రెడ్డి చివరి క్షణంలో తెరమీదకు వస్తారని మరో ప్రచారం స్టార్ట్ అయింది.
కొల్లాపూర్లోనూ అదే పరిస్థితి..
కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి పని చేస్తున్న తనను కాదని జూపల్లి కృష్ణారావుకు టికెట్ కన్ ఫాం చేసిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జగదీశ్వర్ రావు జీర్ణించుకోలేకపోతున్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న జూపల్లికి వ్యతిరేకంగా పని చేసి, ఇప్పుడు ఆయనకు మద్దతెలా ఇవ్వాలని మదనపడుతున్నారు. జూపల్లికి టికెట్ ప్రకటిస్తే తాను మరోదారి చూసుకుంటానని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగదీశ్వర్ రావును తమ వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పలుమార్లు సంప్రదింపులు జరిపారు. జూపల్లిని వ్యతిరేకిస్తూ పీసీసీ సెక్రటరీ అభిలాష్ రావు బీఆర్ఎస్ లో చేరారు. అదే బాటలో జగదీశ్వర్ రావు నడుస్తారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో హైకమాండ్ టికెట్లు ప్రకటించనుండడంతో క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, ఆశావాహుల గొడవలు తలనొప్పిగా మారుతుండగా, తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు.
మక్తల్ లో సీనియర్ల ఆవేదన..
మక్తల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతమ్మ కొడుకు కొత్తకోట సిద్దార్థ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకే కాంగ్రెస్ టికెట్ వస్తుందన్న పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీలో కొనసాగిన దయాకర్ రెడ్డి దంపతులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు. ఇటీవల దయాకర్ రెడ్డి మరణించగా, ఆయన కుటుంబాన్ని స్వగ్రామం వచ్చి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
దీంతో పీసీసీ చీఫ్ ఆశీస్సులతో సిద్దార్థ్ రెడ్డికే టికెట్ కన్ ఫాం అవుతుందని సీనియర్లు అంటున్నారు. దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్ పర్ణికారెడ్డికి పార్టీ నేతలంతా సపోర్ట్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొడుకుతో పాటు మరో ఇద్దరు టికెట్ తమకే వస్తుందని చెబుతున్నారు. మక్తల్ కాంగ్రెస్ లో ఇప్పటికే నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నారు.