రేషన్​కార్డుల లొల్లి మళ్లీ మొదటికి..దరఖాస్తుదారుల్లో గందరగోళం

రేషన్​కార్డుల లొల్లి మళ్లీ మొదటికి..దరఖాస్తుదారుల్లో గందరగోళం
  • మీ సేవా కేంద్రాల్లో మార్పులు, చేర్పులే..
  • మాన్యువల్​గానే కొత్త దరఖాస్తుల స్వీకరణ 
  • వార్డు సభలు ఎప్పుడో చెప్పని బల్దియా  

హైదరాబాద్​సిటీ, వెలుగు: రేషన్​కార్డుల కోసం కొత్త దరఖాస్తులను ఆన్​లైన్​లో స్వీకరించే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఆన్​లైన్​ద్వారా చేసే దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని, అందుకే కొత్త రేషన్​కార్డులకు మాన్యువల్​గానే దరఖాస్తు చేసుకోవాలని చీఫ్​రేషనింగ్​ఆఫీసర్​ఫణీంద్రరెడ్డి స్పష్టం చేశారు. బల్దియా నిర్వహించబోయే వార్డు సభల్లో, అక్కడ అప్లై చేసుకోలేని వారు తమ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. 

వార్డు సభలు ఎప్పుడు ? 

వార్డు సభలు ఎప్పుడో బల్దియా అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్​పరిధిలోని 9 సర్కిళ్లలో రేషన్​కార్డుల కోసం ప్రజా పాలన ద్వారా 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నుంచి వార్డు సభల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దీని తర్వాత కార్డులు రానివారు అక్కడే అప్లై చేసుకోవచ్చు. 

అయితే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి కొత్త దరఖాస్తులు తీసుకుంటుండగా, గ్రేటర్​లో ఇంకా పాత దరఖాస్తులకు సంబంధించిన అర్హుల జాబితానే వెల్లడించలేదు. ఇంతకుముందు ఫిబ్రవరి మొదటివారంలో వార్డు సభలు పెడతామని ప్రకటించగా, తర్వాత రెండో వారంలో ఉంటుందన్నారు. అయినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.  

సాంకేతిక కారణాల వల్లనే నిలిపివేత

మీసేవలో కొత్త రేషన్​ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. దీంతో శనివారం అంతా మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టగా ఆప్షన్​తొలగించారని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధికారులు సాంకేతిక కారణాల వల్ల కొత్త దరఖాస్తులను తీసుకోలేదని, మార్పులు, చేర్పులు అయితే మీసేవాలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. 

కొత్త అప్లికేషన్ల కోసం వార్డు సభలు పెట్టేవరకు ఆగాలని, ఇప్పటికే కొందరు కలెక్టరేట్​లో నిర్వహిస్తున్న ప్రజా వాణిలోనూ దరఖాస్తు చేసుకున్నారని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామంటున్నారు.  గ్రేటర్​ పరిధిలో కొత్త రేషన్​కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దాదాపు రెండున్నర లక్షల మంది ఎదురుచూస్తుండగా ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయ లోపం, తప్పుడు ప్రకటనలతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.