భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి మెడికల్ బోర్డులో మాయాజాలం నెలకొంది. మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యేవారి వివరాలను సీక్రెట్‌గా ఉంచాల్సి ఉన్నప్పటికీ లీక్ కావడం కలకలం సృష్టించింది. మెడికల్ బోర్డులో దళారుల దందా సాగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కొత్తగూడెంలోని సింగరేణి హాస్పిటల్లో గురు, శుక్రవారాల్లో కారుణ్య నియామకాల్లో భాగంగా మేనేజ్మెంట్ మెడికల్ బోర్డు నిర్వహించింది.
మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఒకటి రెండు రోజుల ముందు మెయిన్ హాస్పిటల్ నుంచి వారు పనిచేస్తున్న మైన్/డిపార్ట్ మెంట్‌కు సమాచారం వెళ్తుంది. మైన్/డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మెడికల్ బోర్డుకు అటెండ్ కావాలని సమాచారం ఇస్తారు. ఈ విషయం అప్లై చేసుకున్న వారికే తెలియాలి. ఇదిలా ఉండగా సింగరేణి వ్యాప్తంగా మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యే వారి వివరాలు మెడికల్ బోర్డు ఇంటర్వ్యూలకు గంట ముందుగానే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మెడికల్ బోర్డు ఇంటర్వ్యూలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
సింగరేణి వ్యాప్తంగా 178 మంది అటెండ్ కావాల్సి ఉండగా దాదాపు 36 మంది ఆబ్సెంట్ కావడం గమనార్హం. మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యే వారి వివరాలు బయటకు రావడంతో హాస్పిటల్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సారి మెడికల్ బోర్డు స్ట్రిక్ట్‌గా ఉంటుందనే ప్రచారం సాగడంతో దళారులు ముందస్తుగా తమతో ఒప్పందం చేసుకున్న వారిని అటెండ్ కాకుండా చూసుకున్నారని ప్రచారం జరిగింది. ఆబ్సెంట్ అయిన వారు ఎందుకు రాలేదో అనే విషయంతో పాటు సోషల్ మీడియాలో ముందస్తుగానే బోర్డుకు అటెండ్ అయ్యే వారి వివరాలు ఎలా బయటకు వచ్చాయో యనే అంశంపై విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ చేస్తున్నారు.