పంచాయతీ శాఖలో బదిలీల పంచాది

పంచాయతీ శాఖలో బదిలీల పంచాది
  •    ఆందోళన చేస్తామన్న సెక్రటరీలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా పంచాయతీ శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇటీవల ఒకే చోట నాలుగేండ్లకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలంటూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో 217 విలేజ్ సెక్రటరీలను బదిలీ చేయనున్నట్లు ఆఫీస్ ముందు నోటీసు అంటించారు. సీనియారిటీ ఆధారంగా గత సోమవారం 55  మంది గ్రేడ్ 1,2,3 సెక్రటరీలను బదిలీ చేశారు. మిగిలిన 162 గ్రేడర్ 4 పోస్టుల్లో క్యాడర్ స్ట్రెంత్ ( ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అనుమతి) లేదని 123 మాత్రమే చూపించి రెండు రోజుల కిందట జాబితా విడుదల చేశారు.

దీంతో అవాక్కయిన కార్యదర్శులు తొలుత 217 ఖాళీలు చూయించినప్పుడు లేని క్యాడర్ స్ట్రెంత్ ఇప్పుడు ఎక్కడిని నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పైరవీకారులకు లబ్ధిచేయడానికి జిల్లా కేంద్రానికి, ఇతర పట్టణాల దగ్గర ఉన్న 39 పంచాయతీలను కనపడకుండా చేశారని ఆరోపిస్తున్నారు. వాటిని లిస్ట్ లో చేర్చిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేపట్టాలని లేదంటే, ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

దీనిపై జిల్లా అధికారి, కలెక్టర్ ను కలిసి  ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. గురువారం నుంచి గ్రేడ్ 4 కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ చేపట్టనుండగా, వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడంతోనే బ్లాక్ చేశాం 

కొన్ని మండలాల్లో సిబ్బంది అదనంగా ఉండడంతో 30 గ్రామ పంచాయతీ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టం. క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడంతో బదిలీ చేస్తే కార్యదర్శులకు జీతాలు వచ్చే అవకాశం ఉండదు. ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా పొరపాటు చేయడం లేదు. 

- సురేశ్, డీపీవో, సూర్యాపేట జిల్లా