కొందరిని ఆటలో అవుట్ చేయడం కష్టం. ఆట మొదలు పెట్టే ముందే వారు చివరి అంకాన్ని అంచనా వేస్తారు. ఆటలో ఓడిపోయే పరిస్థితి వస్తే మార్కెట్ మంత్రం ప్రయోగిస్తారు. ఈ కోవకు చెందిన రాజకీయ ఆటగాడే కేసీఆర్. తెలంగాణ ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తాను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తన పంతాన్ని నెగ్గించుకుంటూ వస్తున్న మొండిఘటం. సమైక్య రాష్ట్రంలో తిరుగు లేని నేతగా ఎదిగిన చంద్రబాబును తెలంగాణ నేలపై మాత్రం ఆయన ప్యతారను పాతాళం లోకి తొక్కి తన మార్కు రాజకీయానికి తెర లేపారు. తన రాజకీయ ఎదుగుదలకు ఉద్యమ ఆకాంక్షలను రక్షణ వలయాలుగా మార్చుకొని, ఇంతింతై వటుడింతై తెలంగాణ అనే బ్రహ్మాండమంతా వ్యాపించాడు.
పట్టున్న నేతలను పంపేయడం
తన పార్టీ ఆవిర్భావ సింహ గర్జన సభ కరీంనగర్ వేదికపై ఉన్న నేతలు ఒకటో వంతు కూడా నేడు ఆయన వెంటలేరు. ప్రశ్నించే తత్వం, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, ప్రజల్లో ప్రతిష్ట ఉన్న ఒక్కొక్క నేతను ఇంటి దారి పట్టించారు. ఒకసారి తన శిబిరం నుంచి బయట పడితే తిరిగి బట్ట గట్టిన నేతలు తెలంగాణ రాజకీయ చరిత్రలో దాదాపు లేరు. బోయినపల్లి హనుమంతరావు, సుదర్శన్ రావు, ఇన్నయ్య, దేశిని చినమల్లయ్య, రవీందర్ నాయక్, చంద్రశేఖర్, మురళీధర్ దేశ్ పాండే, రహమాన్, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నంది నిర్మల రెడ్డి, సంతోష్ రెడ్డి, విజయ రామారావు, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కే కే మహేందర్ రెడ్డి, ఆలె నరేంద్ర, విజయశాంతి, రేగులపాటి పాపారావు, బండి పుల్లయ్య, కొండగి రాములు ఇలా రాసుకుంటే పోతే చాంతాడంత అవుతుంది.
ఆకర్షించు, ఉపయోగించు, వదిలేయ్ అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టిన దిట్ట. తన అవసరం కోసం ఎన్ని మెట్లు దిగడానికి సిద్ధపడుతాడో, అవకాశం వస్తే అంతు లేని మెట్లు ఎక్కే నైజం. తనకు పోటీగా ఎదుగుతారంటే నరేంద్ర తెలంగాణ సాధన సమితి, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీలను తన చతురతతో విలీనం చేసుకున్నాడు. ఉద్యమ కాలం జేఏసీకి ధీటుగా పని చేస్తున్న ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు తిరుమలి లాంటి ప్రొఫెసర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపేంత ఆరోహణం, అవరోహణం ఆయన సొంతం. ఎప్పుడు ఎత్తుకోవాలో, ఎప్పుడు బరువు దింపు కోవాలో తెలిసిన నేత. నమ్మిన నరేంద్రకు, విజయ శాంతికి పగలు చుక్కలు చూపించారు.
ఆట తప్పితే సెల్ఫ్ గోలే..
దేశ రాజకీయాల్లో ఊరందరిది ఒకదారి అయితే, ఉలిపికట్టెది ఒకదారి అన్న చందంగా కేసీఆర్ వైఖరి ఉంది. అసలు జాతీయ స్థాయిలో కూటముల ప్రస్తావనే లేనప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేసి ఫ్రంట్ టెంట్ జెండా పీకేశాడు. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత గుజరాత్, కర్నాటక శాసనసభ ఎన్నికలు వచ్చినప్పటికీ వాటికి దూరంగా ఉన్నాడు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నాడు. బీఆర్ఎస్ ఆవిర్భవించి నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు జాతీయ కమిటీని ప్రకటించలేదు. కొన్ని విషయాల్లో ఉదాసీనంగా ఉండటం మొదటి నుంచి అలవాటు. ముఖ్యంగా పార్టీ నిర్మాణం విషయంలో, తెలంగాణ రాజకీయాలను చదరంగంలా ఆడటం, అవకాశం వస్తే చెక్ పెట్టడం, ఓడిపోయే పరిస్థితి వస్తే కాయలను చెల్లా చెదురు చేయడం అనే తొండాటకు ఆయనే ఆద్యుడు కాగలడు. ఎంతటి ఆటగాడైనా.. కాలం కలిసి రాకపోతే సెల్ఫ్ గోల్ తప్పదు.
బీజేపీ, కాంగ్రెస్‌లతో ఆట
తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్ కు, మద్దతు ఇచ్చిన బీజేపీకి పంగనామలు పెట్టి ఇరు పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసిన శకుని నీతి ఆయన సొంతం. తెలంగాణ రాజకీయాల్లో ఒకసారి సెంటిమెంట్‌తో, రెండోసారి ఎన్నికల చతురతతో నెగ్గి, మూడోసారి తికమక(కన్ఫ్యూజన్)తో తొండటాకు తెర తీస్తున్నాడు. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో రెండు జాతీయ పార్టీలతో ఆటలాడుకుంటున్నాడు. సమయానుకూలంగా బీజేపీ, కాంగ్రెస్ స్థాయిలను పెంచి హైప్ క్రియేట్ చేసి, కొంత కాలం ఉనికిలో ఉంచి, తర్వాత నిర్వీర్యం చేయడం ఇప్పుడు జరుగుతున్న తంతు. దేశంలో బీజేపీ విస్తరణ దండ యాత్రలాగా కొనసాగుతున్నా.. తెలంగాణలో మాత్రం పాచికలు పారకపోవడంలో లోగుట్టు ఏందో పెరుమాళ్ల కెరుక. కేసీఆర్ అవినీతిని ఏటీఎంలతో పోల్చిన నేతలే మౌనముద్రలో ఉన్నారంటే కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుంది? బీజేపీ రాజకీయ వ్యూహం అయిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదానికి దక్షిణాన కేసీఆర్ సై అని పనిచేయడమేనా అన్న సందేహాలు మొలకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన సంబంధాలు ఉన్న నేత కేసీఆర్. ఒకదశలో పీసీసీ అధ్యక్షుల నియామకమే కేసీఆర్ ఇష్టానుసారంగా జరిగిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. తెలంగాణ కాంగ్రెస్ లోని పెద్ద తలకాయలు అన్ని కేసీఆర్ ఆత్మలే అన్న రుజువులు పొక్కొయి. రాజకీయాల్లో అనుకూల శత్రువులను సృష్టించుకోవడం ఒక కళ. అందులో రాటుదేలిన నేత కేసీఆర్. తెలంగాణ రాజకీయాలను సాఫ్ట్‌వేర్‌గా మార్చుకొని వీడియో గేమ్ లాగ ఆడుతున్నారు.
కన్ఫ్యూజన్ గేమ్
సంక్షేమ పథకాల వ్యసనంలో ప్రజలను దింపి తన రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారడం అనేది ఆషామాషీగా జరిగిన పరిణామం కాదు. అదో పెద్ద రాజకీయ తంత్రం. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో గుర్తిం చనంత కాలం ప్రజలు మోసపో తూనే ఉంటారని లెనిన్ మహాశ యుడు అన్నాడు.
పక్కా వ్యూహా త్మకంగా తీసుకున్న నిర్ణయమే బీఆర్ఎస్. కేసీఆర్ రాజకీయం వ్యూహాలకు పదునుపెట్టి చివరకు మూడోసారి తెలంగాణ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ చేసి గెలవాలన్నదే కేసీఆర్ ఎత్తుగడ. రాజకీయాల్లో సునామీని సృష్టించినట్టు చేసి, చివరికి దాన్ని టీకప్పులో తుపానుగా మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాలంటే అమ్మడం, కొనడం, ఇయ్యడం, తీసుకోవడం అన్న సూత్రాన్ని అచ్చు పోసినట్టుగా ఆచరించడంలో ఆయనే సాటి. ప్రణాళికా బద్దంగా వ్యవహారాలను నడపటం కంటే, అంది వచ్చిన అవకాశాలనే ఆయు ధాలుగా మలచుకోవడంలో సిద్ధహస్తుడు అని చెప్పవచ్చు.
- దొమ్మాట వెంకటేశ్,ఫ్రీలాన్స్ జర్నలిస్ట్