ఖమ్మం, వెలుగు: పార్టీ మారే టైంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరులను పాత కేసులు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం పొంగులేటి వెంట ఉన్న వారిలో కీలక నేతలైన డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ప్రస్తుత డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వర్గం నేతలు చెప్తున్నారు. అధికార పార్టీకి చెందిన లీడర్ల వ్యూహంలో భాగంగానే పాత కేసులను ముందుకు తీసుకొచ్చి పొంగులేటి వెంట వెళ్లకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.
ఇటీవల జరిగిన డీసీసీబీ పాలకవర్గ సమావేశంలోనూ ఇదే విషయంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య లేవనెత్తారు. 2013 నుంచి 18 వరకు జరిగిన అక్రమాలపై ఇప్పుడు కావాలనే మువ్వా విజయ్ బాబును కార్నర్ చేసేందుకు కొందరు లీడర్లు ప్రయత్నిస్తున్నారని, బీఆర్ఎస్ లో లేరనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. దీంతో కాసేపు మీటింగ్ లో గందరగోళం ఏర్పడింది. అదే రోజు సాయంత్రం బ్రహ్మయ్యపై మరో కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం బయటకొచ్చింది.
రంగంలోకీ సీబీసీఐడీ..!
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో 2013 నుంచి 2018 వరకు చైర్మన్గా మువ్వా విజయ్ బాబు కొనసాగారు. ఆ టైంలో అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత వచ్చిన పాలకవర్గం ఫిర్యాదుతో ఖమ్మంలోని రెండు పోలీస్ స్టేషన్లలో రెండేండ్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత దృష్ట్యా వాటిని ఆ తర్వాత సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేశారు. డిపార్ట్మెంటల్ విచారణ చేసి అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. ఈ కేసుల్లో విజయ్ బాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో లాకర్లు, సోలార్ యూపీఎస్ ల కొనుగోలు, బ్రాంచుల ఆధునికీకరణ పనులు, ఆస్పత్రి నిర్మాణం తదితర పనుల్లో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా డీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈనెల 19న సీబీసీఐడీ ఆఫీసర్లు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.
అప్పటి సీఈవో , అప్పటి చైర్మన్ మువ్వా విజయ్ బాబు కనుసన్నల్లో ఇదంతా జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడంతో, నాలుగైదు రోజుల నుంచి డీసీసీబీ హెడ్ ఆఫీస్ లో ఎంక్వైరీ జరిగింది. కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులు, రికార్డులను సీఐడీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అప్పటి పాలకవర్గం హయాంలో తప్పుడు సర్టిఫికెట్లతో రూ.కోట్లు మార్టిగేజ్ లోన్లు ఇచ్చిన విషయంలో మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసులను కూడా సీఐడీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు.
బ్రహ్మయ్యపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..
మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిరుడు డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ భూ వివాదానికి సంబంధించి గత జూన్ 29న బ్రహ్మయ్య పై అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి జరిగింది. గతంలో అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసి, బదిలీపై పాల్వంచ లో పనిచేస్తున్న పాయం సత్యనారాయణతో పాటు సతీశ్, మరో 40 మంది అశ్వాపురం పీఏసీఎస్ లో బ్రహ్మయ్యపై కత్తితో దాడి చేశారు. బ్రహ్మయ్య కారు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రెండు కేసులు నమోదు కాగా, బ్రహ్మయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అప్పటి నుంచి బ్రహ్మయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడంతో.. ఇటీవల ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే దీన్ని బ్రహ్మయ్య తప్పుపడుతున్నారు. గతేడాది కాలంలో అనేక సార్లు అశ్వాపురం వెళ్లి బహిరంగంగానే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్తున్నారు. పోలీసుల తీరు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
కేసులపై న్యాయపోరాటం చేస్తా..
ఈ కేసులు, ఎంక్వైరీలు అన్నీ రాజకీయ ప్రేరేపితమే. నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాననే కారణంతోనే వేధిస్తున్నారు. ఇవి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలే. నేను చైర్మన్ గా ఉన్న కాలంలో అవకతవకలు జరిగాయని గతంలో ఎంక్వైరీ జరిగింది. దీనిపై కోర్టులో స్టే ఉంది. సీబీసీఐడీ, కొత్త కేసులన్నీ రాజకీయ వేధింపుల్లో భాగమే. దీనిపై తప్పకుండా న్యాయపోరాటం చేస్తా.
- మువ్వా విజయ్ బాబు, డీసీసీబీ మాజీ చైర్మన్