ఒకటో తరగతికి ఐదేండ్లా, ఆరేండ్లా?

ఒకటో తరగతికి ఐదేండ్లా, ఆరేండ్లా?
  • ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ల ఏజ్​పై అయోమయం
  • ఆరేండ్లు ఉండాలని రెండేండ్ల కిందే కేంద్రం ఆదేశాలు 
  • ఎన్ఈపీపై రాష్ట్రంలో నిర్ణయం ప్రకటించని గవర్నమెంట్ 
  • కొన్నింట్లో ఐదేండ్లు.. ఇంకొన్నింటిలో ఆరేండ్లకు అడ్మిషన్లు 
  • క్లారిటీ లేక పేరెంట్స్ లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి అడ్మిషన్లపై అయోమయం నెలకొంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఐదేండ్లు నిండాలా.. లేక ఆరేండ్లు నిండాలా అనే దానిపై స్పష్టత కరువైంది. ఆరేండ్లు నిండితేనే.. ఫస్ట్ క్లాసులో అడ్మిషన్లు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల కింద ఆదేశాలిచ్చింది. 

కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఐదేండ్లు నిండినా ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే, దాదాపు సెంట్రల్  సిలబస్ స్కూళ్లన్నీ ఆరేండ్ల కేటగిరీనే అమలు చేస్తుండగా, స్టేట్  సిలబస్​ స్కూళ్లలో మాత్రం ఒక్కో స్కూల్​ ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. దీంతో పేరెంట్స్ తో పాటు మేనేజ్మెంట్లలోనూ కన్ఫ్యూజ్​ మొదలైంది. 

వేర్వేరుగా అడ్మిషన్లు..

తెలంగాణలో ఏటా ఒకటో తరగతిలో ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల మంది చేరుతున్నారు. నేషనల్  ఎడ్యుకేషన్  పాలసీ (ఎన్ఈపీ–2020)  నిబంధనల ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్  కోసం ఆరేండ్లు నిండి ఉండాలని.. దీన్ని 2024–25 నుంచి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే, ఎన్ఈపీని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అడాప్ట్  చేసుకోకపోవడంతో.. ఏజ్ లిమిట్​పై స్పష్టత కరువైంది. 

ఈ క్రమంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్​తో నడుస్తున్న ప్రైవేట్​ స్కూళ్లు.. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నాయి. ఆరేండ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో సీట్లు కేటాయిస్తున్నారు. అయితే, కొన్ని స్కూళ్లు డిసెంబర్  వరకూ, కొన్ని బడులు మే వరకూ ఏజ్  కటాఫ్ పెట్టుకున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఐదేండ్లు నిండిన వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే, స్టేట్  సిలబస్  అమలు చేస్తున్న ప్రైవేట్​ బడుల్లో మాత్రం అయోమయమే కంటిన్యూ అవుతోంది. కొన్ని బడులు ఐదేండ్లు నిండిన వారికి, ఇంకొన్ని స్కూళ్లు ఆరేండ్లు నిండిన వారిని చేర్చుకుంటున్నాయి. 

ఒకే రూల్​ ఉంటే బెటర్..

స్టేట్ గవర్నమెంట్ లో ఆరేండ్లకు ఒకటో తరగతి పూర్తయిన చిన్నారికి, రెండో తరగతిని సీబీఎస్ఈ సిలబస్  స్కూళ్లలో అడ్మిషన్లకు వెళ్తే ఏజ్  లేదని.. మళ్లీ ఒకటో తరగతిలోనే చేరాలని చెబుతున్నారని పేరెంట్స్  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఈపీ ప్రకారం 3 నుంచి 8 ఏండ్ల వరకు తొలి మూడేండ్ల ప్రీస్కూల్, తర్వాతి రెండేండ్లు ఫస్ట్  క్లాస్, సెకండ్  క్లాస్ పూర్తి చేయాలన్న నిబంధన ఉంది. 

దీన్ని అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం పలుమార్లు లేఖలు రాసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి జరిగే అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేరెంట్స్  కోరుతున్నారు. ఫస్ట్  క్లాస్  అడ్మిషన్లపై క్లారిటీ కరువైందని, ఎన్ఈపీని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్  చేసుకోకపోవడంతోనే ఈ సమస్య ఎదురవుతోందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఎడ్యుకేషన్ పై వేసిన క్యాబినెట్  సబ్  కమిటీకి లేఖ రాస్తామని ఆయన వెల్లడించారు.