నిర్మల్​ జిల్లాలో సీఎంఆర్ రికవరీపై అయోమయం

  •     గత ఖరీఫ్, రబీ సీజన్ బియ్యం రికవరీ గడువు మరోసారి పెంపు
  •     హెచ్చరికలు ఖాతరు చేయని మిల్లర్లు

నిర్మల్, వెలుగు : నిర్మల్​ జిల్లాలో గతేడాది నుంచి సీఎంఆర్ బియ్యం రికవరీ విషయంలో అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2022,2023 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ బియ్యం విషయంలో గందరగోళం తొలగడం లేదు. ఈ బియ్యం రికవరీ విషయంలో సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికా రులు ఇప్పటికే పలుమార్లు రైస్ మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 65 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు కలిపి మొత్తం 77 రైస్ మిల్లులున్నాయి. 2022, 23  ఖరీఫ్ సీజన్​లో 56 రైస్ మిల్లులకు 1లక్షా 68 వేల177 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు.

ఇందులోనుంచి 1లక్షా 12 వేల 838 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 53 వేల 929 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇచ్చారు. మరో 58 వేల 908 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆ బియ్యాన్ని వెంటనే ఇవ్వాలంటూ సంబందిత శాఖ అధికారులు రైస్ మిల్లర్లకు పలుమార్లు గడువు విధించారు. కానీ మిల్లర్లు మాత్రం ఆదేశాలను పట్టించుకోవడంలేదు.

యాసంగిలో 25 వేల మెట్రిక్​ టన్నులు మాత్రమే..

ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే 2022, 23 యాసంగి సీజన్​కు సంబంధించిన 1 లక్షా 58 వేల 566 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు మిల్లింగ్ కోసం కేటాయించారు. 1 లక్షా 6 వేల 44 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లర్లు కేవలం 25 వేల మెట్రిక్ టన్నులను అందించి, 1 లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పలుసార్లు డెడ్​లైన్ నోటీసులు జారీ చేసినప్పటికీ రైస్ మిల్లర్లలో కదలిక కనిపించలేదు. దీంతో మరోసారి గడువు పెంచారు.

ఈనెల 31లోగా ఖరీఫ్, రబీ సీజన్​లకు సంబంధించిన మొత్తం సీఎంఆర్ బియ్యన్ని పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలంటూ ఆదేశించింది. నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. 2023, 24 సంవత్సరాల సంబంధించిన ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని కూడా సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు కేటాయించడం చర్చనీయాంశమైంది. 

గడువులోగా సాధ్యమేనా?

ఈనెల 31లోగా గత ఖరీఫ్, రబీ సీజన్​లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలంటూ ఆదేశాలు వెలువడగా.. మిగిలిన ఈ 15 రోజుల్లో రికవరీ కావడం సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం గడువులోగా 1 లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు అప్పజెప్పాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం తరలింపుతో రైస్ మిల్లులన్నీ కిటకిటలాడుతుండగా.. గత ఖరీఫ్, రబీ సీజన్​లకు సంబంధించిన బియ్యాన్ని డెడ్​లైన్​లోగా ఇచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీంతో గడువును మరోసారి పెంచేలా రైస్ మిల్లర్లు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.

అధికారి సెలవుపై అనుమానాలు

 కొంత కాలంగా సీఎంఆర్ విషయంలో ఉన్నతాధికారులతోపాటు రాజకీయంగానూ సంబంధిత జిల్లా అధికారి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎంఆర్ బియ్యం రికవరీ విషయంలో ప్రభుత్వం సీరియస్​గా వ్యవహరించే అవకాశాలున్న నేపథ్యంలో ఆ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఆయన సెలవు విషయంలో ఆ ఆఫీసు సిబ్బంది ఎవరూ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఒత్తిళ్ల కారణంగానే ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డెడ్​లైన్​లోగా రైస్ మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. గడువు దాటితే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటారా? లేక మరోసారి గడువు పొడిగిస్తారా? అనే చర్చ సాగుతోంది.